Road Damage Due To Heavy Rains : ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. పలుచోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. దీంతో జనజీవనం స్తంభించింది. ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
భారీ వర్షాలకు కొట్టుకుపోయిన రోడ్డు : జగిత్యాల జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో జనవాసాల్లోకి వరదనీరు చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలంలోని యమాపూర్, ఫకీర్ కొండాపూర్ గ్రామాల వాగుపై ఉన్న రహదారి వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. బాహ్య ప్రపంచంతో ఆ గ్రామానికి సంబంధాలు తెగిపోయాయి. గత 15 రోజుల క్రితం ఇదే రహదారి వరద ఉద్ధృతికి కొట్టుకుపోవడంతో మట్టినిపోసి రోడ్డు వేశారు. తాజాగా కురిసిన వర్షాలకు రోడ్డు పూర్తిగా కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు దీనిపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.
పెద్దపల్లి జిల్లాలో కూలిన ఇల్లు : పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం పరిధిలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాల కారణంగా పురపాలక పరిధిలోని బోయినిపేటలో కుంట సమ్మక్క ఇల్లు కూలిపోయింది. వర్షానికి ఇంటి పైకప్పు నుంచి వరదనీరు ఇంట్లోకి చేరుతుండటంతో భయపడి గత రాత్రి పక్కవారి ఇంట్లో నిద్రపోయారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయం 3 గంటలకు ఇంటి పైకప్పుతో పాటు గోడలు కూలిపోయాయి. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందని బాధితులు తెలిపారు.
ఇల్లు కూలిపోవడంతో ఇంట్లో ఉన్న నిత్యావసర వస్తువులు, సామాన్లు తడిచిపోయాయి. సుమారు రూ.50 వేలవరకు నష్టపోయామని బాధితులు వాపోయారు. చిన్నప్పుడే తల్లిందండ్రులను కోల్పోయి ఇద్దరు ఆడపిల్లలమే నివసిస్తున్నామని ఇప్పుడు ఇల్లు కూలిపోవడంతో కట్టుబట్టలతో మిగిలామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలశయాలు కూడా నిండుకుండలను తలపిస్తున్నాయి. మేడిగడ్డ జలశయానికి కూడా రికార్డు స్థాయిలో నీటి ఇన్ఫ్లో ఉంది. మిగిలిన జలాశయాల్లోకి వరదనీరు వచ్చి చేరుతుంది.