Lok Sabha Elections 2024 : రాష్ట్రాన్ని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుందని, ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటోందని ప్రధాని మోదీ ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం పేరిట లూటీ చేసిందని, హస్తం ప్రభుత్వం వచ్చాక అదేవిధంగా లూటీ చేస్తోందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆర్‌ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తోందని దుయ్యబట్టారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్‌నగర్ అభ్యర్థి డీకే ఆరుణకు మద్దతుగా నారాయణపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. 'నా పాలమూరు సోదరసోదరీమణులకు హృదయపూర్వక నమస్కారాలు. జోగులాంబ తల్లి పాదాలకు నమస్కరిస్తున్నా' అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ, మోదీ గ్యారంటీ అంటే అభివృద్ధికి గ్యారంటీ, మోదీ గ్యారంటీ అంటే దేశ భద్రతకు గ్యారంటీ అని, మోదీ గ్యారంటీ అంటే విశ్వవేదికపై భారత గౌరవానికి గ్యారంటీ, మోదీ గ్యారంటీ అంటే ఇచ్చిన హామీలు నెరవేరతాయని ఆయన పేర్కొన్నారు.
గత పదేళ్లలో తెలంగాణకు రూ.లక్షల కోట్లు ఇచ్చామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తాము ఇచ్చిన నిధులు అవినీతి ఏటీఎంలోకి వెళ్లాయని ఆయన దుయ్యబట్టారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుందని, ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటోందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం పేరిట లూటీ చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ దారిలోనే లూటీ చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆర్‌ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తోందని ఆరోపించారు.
ఆర్‌ఆర్ ట్యాక్స్ విషయంలో తాను ఎవరి పేరు చెప్పలేదని, అయినప్పటికీ ఆర్‌ఆర్ ట్యాక్స్‌పై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రేవంత్ స్పందించటం చూస్తే, ఆర్‌ఆర్ ట్యాక్స్ ఎవరు వసూలు చేస్తున్నారో అర్థమవుతోందన్నారు. మహబూబ్‌నగర్ ప్రాంతాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు తమ స్వార్థానికి వాడుకున్నారని దుయ్యబట్టారు. మహబూబ్‌నగర్ ప్రాంతానికి కృష్ణా, తుంగభద్ర నదుల ఆశీర్వాదం ఉందని, మహబూబ్‌నగర్‌లో సాగునీటి ప్రాజెక్టులకు రూ.వేల కోట్లు ఇచ్చినప్పటికీ సద్వినియోగం కాలేదని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ రాకుమారుడు ఎన్నికలు రాగానే విద్వేష విషం చిమ్ముతున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ రాకుమారుడి రాజగురువు మనల్ని రంగు ఆధారంగా అవమానించారని, శరీర రంగును బట్టి దక్షిణ భారత్ వాళ్లు ఆఫ్రికన్లు అని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు హిందువులు, హిందువుల పండుగలు అంటే ఇష్టం లేదని, తాను గుడికి వెళ్తే కూడా దేశ వ్యతిరేకమైన పని అని విమర్శిస్తున్నారని పేర్కొన్నారు.
దేశంలో హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మోదీ ఆరోపించారు. మతపరమైన రిజర్వేషన్లు ఇస్తే, మతమార్పిడులు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచేటప్పుడు దానికి అడ్డుపడింది కాంగ్రెస్ పార్టీయేనని, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను ముస్లింలకు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రయత్నించిందని దుయ్యబట్టారు. ముస్లిం రిజర్వేషన్ల కోసం ఎంతో కృషి చేస్తున్న కాంగ్రెస్, ఎస్సీల రిజర్వేషన్లను పట్టించుకోవట్లేదని మండిపడ్డారు.
"రాష్ట్రాన్ని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం పేరిట లూటీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆర్‌ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తోంది. గత పదేళ్లలో తెలంగాణకు రూ.లక్షల కోట్లు ఇచ్చాం. ఇచ్చిన నిధులు అవినీతి ఏటీఎంలోకి వెళ్లాయి". - మోదీ, ప్రధాని