Jails Are Overcrowded With Prisoners : తెలంగాణలో జైళ్లు ఖైదీలతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్‌లో కీలకమైన చంచల్‌గూడ, సంగారెడ్డి తదితర కారాగారాల్లో సామర్థ్యానికి మించి దాదాపు రెట్టింపు, అంతకుమించిన సంఖ్యలో ఖైదీల్ని ఉంచుతున్నారు. మరికొన్ని కీలక జైళ్లలో 50-60 శాతం మంది అదనంగా ఉంటున్నారు. డ్రగ్స్ కేసుల్లో నిందితులు క్రమేపీ పెరుగుతుండటం, రిమాండ్ ఖైదీలను తరలించే జైళ్ల పరిధిని మార్చడం ఇందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఖైదీల్లో మానసిక సమస్యలు అధికమయ్యే ప్రమాదంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
ఖాళీలేని చంచల్‌గూడ జైలు : డ్రగ్స్ వినియోగానికి సంబంధించిన కేసుల్లో హైదరాబాద్, సైబరాబాద్‌లలో చిక్కుతున్న నిందితులందరినీ దాదాపుగా చంచల్‌గూడ జైలుకే తరలిస్తుండటంతో బరాక్‌లన్నీ ఖైదీలతో నిండిపోతున్నాయి. గతంలో రాజేంద్రనగర్, ఎల్బీనగర్, షాద్ నగర్ న్యాయస్థానాలు రిమాండ్ విధించిన ఖైదీలను శివారులోని చర్లపల్లి జైళ్లలో ఉంచేవారు. ఇలా వారిని తరలించేందుకు రవాణా వ్యయం అధికమవుతండటం, ఎస్కార్ట్ కల్పించడంలో ఇబ్బందుల్లాంటి కారణాలతో కోర్టుల అనుమతి తీసుకుని చంచల్‌గూడ జైలుకే తరలిస్తున్నారు.
కారాగారాలు దిద్దుబాటలో నడిస్తే సంస్కరణలకు నిలయాలే
ఈ జైలులో 1250 మంది ఖైదీలు ఉండడానికే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం 2103 మంది ఉన్నారు. గతంలో మూసివేసిన వీఐపీ బరాక్‌నూ తెరిచి సర్దుబాటు చేశారు. ఈ జైళ్లో ప్రతిరోజు సగటున 500 వరకు ములాఖత్‌లు ఉంటాయి. ఖైదీలు ఎక్కువైన కారణంగా వారి కుటుంబసభ్యులందరికీ ములాఖత్ కల్పించడం కష్టసాధ్యంగా మారుతోంది. రోజూ 2 గంటలపాటు అదనపు సమయం కేటాయించాల్సి వస్తోంది. అప్పటివరకు సుదూరప్రాంతాల నుంచి వచ్చిన ఖైదీల కుటుంబసభ్యులు నిరీక్షించాల్సి వస్తోంది. మరోవైపు డ్రగ్స్ కేసుల నిందితులు ఆ వ్యసనం నుంచి బయటపడలేక చేసే చేష్టలను (విత్‌డ్రాయల్ సింప్టమ్స్) కట్టడి చేయడం అధికారులకు తలకుమించిన భారంగా మారింది.
విచారణ ఖైదీలే అత్యధికం : తెలంగాణలో ప్రస్తుతం 4 కేంద్ర కారాగారాలు, 7 జిల్లా జైళ్లు, 29 సబ్‌జైళ్లు, 2 మహిళా కారాగారాలు ఉన్నాయి. వాటి సామర్థ్యం 7,392గా ఉంది. ప్రస్తుతం 7,667 మంది ఖైదీలు ఉన్నారు. వీరిలో అత్యధికంగా విచారణ ఖైదీలే ఉన్నారు. వారి సంఖ్య 4,791 మంది. శిక్ష ఖరారైన ఖైదీలు 2023 మంది, రిమాండ్ ఖైదీలు 838, ఇతర బందీలు 15 మంది ఉన్నారు.
సిద్దిపేట జిల్లా జైలు నిర్మాణమైతే ఉపశమనం : ప్రభుత్వ హాస్పిటల్ నిర్మాణం కోసం వరంగల్ కేంద్ర కారాగారాన్ని ఖాళీ చేయించారు. అందులోని వెయ్యి మంది ఖైదీలను హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్‌లో ఉన్న జైళ్లలో సర్దుబాటు చేశారు. రూ.90 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న సిద్దిపేట జిల్లా జైలు అందుబాటులోకి వస్తే కొంతవరకు ఉపశమనం కలుగుతుందని జైళ్లశాఖ వర్గాలంటున్నాయి. ప్రస్తుతం ఆ జైలులో 37 మంది ఖైదీలు ఉన్నారు. నూతన భవనం అందుబాటులోకి వస్తే 500 మంది ఖైదీలను అందులో ఉంచే అవకాశముంటుంది.
పదేపదే నేరాల్లో పాత నిందితులు.. దేశవ్యాప్తంగా తెలంగాణది మూడో స్థానం