Potti Sreeramulu Engineering College Students Unique Innovations With AI, ML Technology : తరగతి పాఠాలకే పరిమితం కాకుండా ప్రతిభతో ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు ఈ విద్యార్థులు. కళాశాల ప్రోత్సాహంతో వినూత్న పరికరాలు చేసి ప్రాజెక్టు ఎక్స్‌పో ప్రదర్శించారు. ఏఐ, మిషన్ లెర్నింగ్ సాయంతో రూపొందించిన ఆ పరికరాలు అందర్నీ ఆకట్టుకోవడంతోపాటు ఆలోచింప జేశాయి. విజయవాడ పొట్టి శ్రీరాములు ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు చేసిన ఆ ఆవిష్కరణల ప్రత్యేకతలు, విశేషాలు ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
మదిలో మెలిగే ఆలోచనలకు ప్రాణం పోశారు ఈ విద్యార్థులు. రోజు జరిగే తరగతి పాఠాలకు విభిన్న ప్రయోగాలు, పరిశోధనల బాట పట్టారు. ప్రాజెక్టు ఎక్స్‌పో పేరుతో కళాశాల ప్రోత్సాహిస్తే ప్రతిభ, నైపుణ్యాలకు పదును పెట్టారు. సాంకేతికత జోడిస్తూ 2 నెలలు కష్టపడ్డారు. ఫలితంగా సమాజహిత ఆవిష్కరణలు చేశారు. విజయవాడ పొట్టి శ్రీరాములు ఇంజినీరింగ్ విద్యార్థులు.
వీధి దీపాలు రాత్రీపగలు తేడా అంటూ లేకుండా వెలిగి ఉండడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. కానీ ఎలా ఆపాలో తెలియక వదలి వెళ్లిపోతుంటాం. కొన్ని సందర్భాల్లో వాటి దగ్గరకు వెళ్లి చూస్తే షాక్ కొడుతుందేమోనని భయపడతాం. ఆ ఇబ్బంది లేకుండా నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు ఈ ఇంజినీరింగ్ విద్యార్థులు.
ఇప్పటి వరకు బొగ్గు, ఆయిల్, నీరు, సోలార్ పద్ధతిలో విద్యుత్తు ఉత్పత్తి చేశాం. కానీ చెట్ల ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేస్తే ఎలా ఉంటుంది. వీరు ప్రయోగాత్మకంగా చేశారు అది కూడా పూర్తి సహజ సిద్ధంగా.
'రోడ్డు ప్రమాదాలు జరగడానికి ప్రధానమైన కారణాల్లో నిద్ర ఒకటి. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి యాంటీ స్లీప్ అలారం చేశాం. ఒకవేళ ఈ పద్ధతిలో లోపం వచ్చినా ప్రమాద నివారణకు మరో ఆవిష్కరణ చేశాం. అదే అబ్‌స్టాకిల్ అవాయిడ్ కార్. దీని ద్వారా వెహికిల్‌కు ప్రమాదం జరిగే సందర్భం ఎదురైతే వెంటనే స్పందించి దిశను మార్చి మనల్ని రక్షిస్తుంది.' - రమ్య, ఇంజినీరింగ్ విద్యార్థిని
వాట్సాప్ నుంచే ఇంట్లో ఉండే టీవీ, ఫ్యాన్, లైట్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను ఎక్కడ ఉన్నా ఆఫ్, ఆన్ చేసే విధంగా ఆవిష్కరణ చేశారు ఈ విద్యార్థులు. వరదల ముందే గుర్తించేందుకు సెన్సార్ ద్వారా అలర్ట్ చేసే ఫ్లడ్ డిటెక్షన్ రూపొందించారు. ఎలక్ట్రికల్ వాహనాల కోసం వైర్‌లెస్ ఛార్జింగ్ పవర్ స్టేషన్‌ను రూపొందించారు.
'కళాశాల దశలోనే ఇంజనీరింగ్ విద్యార్థులు సాంకేతిక ఆవిష్కరణలు రూపొందించడం ప్రశంసించే విషయం. విద్యార్థుల్లో వినూత్న ఆలోచనలుంటే వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నాము. నేటి విద్యార్థుల ఆలోచనలే రేపటి భవితకు మార్గదర్శకులు. ఆ మాటను మా కళాశాల విద్యార్థులు నిజం చేసేలా తయారు చేస్తున్నాం.' -పతాంజలి శాస్త్రి, ప్రిన్సిపల్
ఈ ప్రాజెక్టు ఎక్స్‌పోలో 150 మందికిపైగా ఇంజినీరింగ్ విద్యార్థులు పాల్గొన్నారు ఏఐ, ఎంఎల్ పరిజ్ఞానంతో కొత్తగా పరికరాలు రూపొందించి అందరిని ఆలోచింపజేశారు. భవిష్యత్తులో ఈ ఆవిష్కరణలు పూర్తి స్థాయిలో సిద్ధం చేసి సమాజానికి అందిస్తామని చెబుతున్నారు
ఐడియా అదుర్స్ - హైడ్రోజన్‌తో నడిచే హైబ్రిడ్ స్కూటీ ఆవిష్కరణ - Hybrid Bike Runs with Hydrogen