Kurumurthy Swamy Laddu Quality : పేదల తిరుపతిగా విరాజిల్లుతున్నటువంటి శ్రీకురుమూర్తి స్వామివారి వారి ప్రసాదంలో నాణ్యత లోపించడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. స్వామివారి ఉత్సవాలు ప్రారంభం కావడంతో ఆలయానికి భక్తుల తాకిడి మొదలైంది. స్వామివారి ప్రసాదమైన లడ్డూ, పులిహోరను తయారు చేసి భక్తులకు విక్రయించేందుకు దేవాదాయ శాఖ టెండర్లను నిర్వహించింది. 45 లక్షల రూపాయలకు ఓ గుత్తేదారు టెండరును దక్కించుకున్నారు. సదరు కాంట్రాక్టర్ నాణ్యతా ప్రమాణాలను పూర్తిగా గాలికొదలటంపై భక్తుల నుంచి తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది.
పామాయిల్ వినియోగం : టెండరు రూల్స్ ప్రకారం లడ్డూ తయారీలో మార్కెట్‌లోని వేరుశనగ, ఇతర ప్రథమ శ్రేణి క్వాలిటీ వంటనూనెలు లేదా నెయ్యిను వినియోగించాల్సి ఉండగా కాంట్రాక్టర్ మాత్రం పామాయిల్, అది కూడా చాలా తక్కువగా వాడుతున్నారు. శనగపిండి కూడా నాసిరకమైనదే ఉపయోగిస్తున్నారు. కిలో లడ్డూ తయారు చేసేందుకు జీడిపప్పు, కిస్మిస్, యాలకుల పొడి, పచ్చకర్పూరం కూడా చాలా తక్కువ పరిమాణంలో వినియోగిస్తున్నారు.
పులిహోర తయారీలోనూ రూల్స్‌ను పాటించడం లేదు. నూనె, చింతపండు, ఎండుమిర్చి, మినపపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, జీలకర్ర పొడి, మెంతుల పొడి తదితరాలు తగిన పరిమాణంలో నాణ్యమైనవి వాడటం లేదు. లడ్డూలు, పులిహోర తయారుచేస్తున్న మహిళలు చేతులకు గ్లౌజ్‌లు, తలకు క్యాప్ కూడా ధరించలేదు. న్యూస్‌టుడే పరిశీలనకు వెళ్లడంతో సదరు గుత్తేదారు హడావుడిగా హెయిర్‌నెట్స్‌ను మహిళలకు ఇచ్చారు.
లడ్డూ పరిమాణంలోనూ : లడ్డూ ప్రసాదానికి, అలాగే పులిహోరకు రూ.15 ధరను నిర్ణయించారు. రూల్స్ ప్రకారం లడ్డూ 100 గ్రాముల పరిమాణంలో అమ్మాల్సి ఉండగా 75 నుంచి 80 గ్రాముల బరువే ఉంటోంది. దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ పాలకవర్గం లడ్డూ నాణ్యతపై ఆలయ ఈవో మదనేశ్వర్‌ను ‘న్యూస్‌టుడే’ ఫోన్‌లో సంప్రదించే ప్రయత్నం చేయగా అందుబాటులోకి రాలేదు(లిఫ్ట్ చేయలేదు). ఆలయ కమిటీ ఛైర్మన్ గోవర్ధన్‌రెడ్డిని వివరణ కోరగా పామాయిల్ వాడటానికి వీల్లేదని, ఈ విషయం తమ దృష్టికి రాలేదని పేర్కొన్నారు. తాము తయారీ కేంద్రాన్ని పరిశీలిస్తామని, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా లడ్డూలు, పులిహోర ప్రసాదాల తయారీలో మంచినూనె వాడటంతో పాటు నాణ్యత, శుభ్రతను పాటించేలా చర్యలు చేపడతామని ఆయన స్పష్టంచేశారు.