Political Leaders React on YSRCP Leaders Attack on Eenadu Office : వచ్చే ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని గ్రహించిన జగన్ తన అనుచరుల్ని మీడియా ప్రతినిధులు, సంస్థలపై దాడులకు ఉసిగొల్పుతున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) విమర్శించారు. కర్నూలులో ఈనాడు కార్యాలయంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి (YSRCP MLA Katasani Rambhupal Reddy) అనుచరుల దాడిని ఆయన ఖండించారు. ఈ మేరకు గవర్నర్, కేంద్ర హోంశాఖ మంత్రులకు ట్యాగ్ చేస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం ప్రజల్ని భయపెట్టే చివరి ప్రయత్నమేనన్నారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హింసాత్మక చర్యలకు మరో 50రోజుల్లో ముగింపు పలుకుతామని స్పష్టం చేశారు.
పత్రికా స్వేచ్ఛకు విఘాతం : ఈనాడు కార్యాలయంపై వైఎస్సార్సీపీ మూకల దాడి అప్రజాస్వామికమన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, ఆ పార్టీ నేతల అక్రమాలను బయటపెడుతున్నారనే అక్కసుతో పాత్రికేయుల మీద, మీడియా కార్యాలయాలపైనా దాడులు చేయడం గర్హనీయమని అన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అనుచరుల దాడి క్షమార్హం కాదన్న పవన్‌కల్యాణ్ ఇది పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించడమేనని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యవాదులు ఈ హింసను ఖండించాలని పిలుపునిచ్చారు.
'ఈనాడు' కార్యాలయంపై ఎమ్మెల్యే అనుచరుల దాడి - తాళాలు బద్దలు కొట్టేందుకు యత్నం
రాష్ట్రంలో ఆటవిక పాలన : వైఎస్సార్సీపీ అరాచక పాలనలో జగన్ కాలకేయ సైన్యం మీడియా సంస్థలే లక్ష్యంగా దాడులకు తెగబడుతోందని నారా లోకేశ్ మండిపడ్డారు. అనంతపురం సభలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌ను అంతం చేసేందుకు ప్రయత్నించారని కర్నూలులో ఈనాడుపై రాళ్ల దాడి చేశారన్నారు. నిష్పాక్షిక సమాచారం అందించే ఈనాడుపై దాడి రాష్ట్రంలో ఆటవిక పాలనకు పరాకాష్ఠ అని మండిపడ్డారు. పత్రికా స్వేచ్ఛకు జగన్ సమాధి కట్టారని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు, దాడులు, దౌర్జన్యాలతో వేధింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్సార్సీపీకి గడ్డు రోజులు : తప్పులు సరిదిద్దుకోకుండా వైఎస్సార్సీపీ నేతలు దాడులు చేస్తున్నారని మాజీ మంత్రి సునీత విమర్శించారు. ఈనాడుపై దాడి నిరంకుశ పాలనకు నిదర్శనమని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. పత్రికా కార్యాలయాలపై దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని గుడివాడలో టీడీపీ నేత వెనిగండ్ల రాము అన్నారు. విలేఖరులు, పత్రికా కార్యాలయాలపై దాడులు హేయమని నరసరావుపేటలో రాష్ట్ర విభిన్నప్రతిభావంతుల మాజీ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు మండిపడ్డారు. కర్నూలులో ఈనాడు కార్యాలయాన్ని టీడీపీ నేత గౌరు వెంకట రెడ్డి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు పరిశీలించారు. దాడులు ప్రజాస్వామ్యానికి తీరని మచ్చ అని అన్నారు. వైఎస్సార్సీపీకి గడ్డు రోజులు దాపురించాయని నంద్యాలలో తెదేపా నాయకులు విమర్శించారు. ప్రజలకు నిజాలు తెలియకూడదనే సీఎం జగన్ దాడులు చేస్తున్నారని మాజీమంత్రి దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీడియా సంస్థలపై జగన్ యుద్ధం - విలేకరులపై వైఎస్సార్సీపీ శ్రేణుల దాడి
పోలీసుల సమక్షంలోనే దాడులు : ఈనాడు కార్యాలయంపై దాడి అమానుషమని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను అధికార పార్టీ హరిస్తోందని, నిజాలను జీర్ణించుకోలేక నిందలు మోపుతూ ప్రత్యక్ష దాడులకు దిగుతోందని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. పత్రికా ప్రతినిధులపై దాడి అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్లేనన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు ఈనాడుపై దాడిని ఖండించారు. పోలీసుల సమక్షంలోనే వైఎస్సార్సీపీ మూకలు బీభత్సం సృష్టించడం అరాచకానికి పరాకాష్ఠని మండిపడ్డారు.
దేశవ్యాప్త ఆందోళనకు దిగుతాం : సీఎం ప్రోద్బలంతోనే వైఎస్సార్సీపీ నేతలు బరితెగిస్తున్నారని ఏపీయూడబ్ల్యుజే రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వీ సుబ్బారావు ఆరోపించారు. కర్నూలులో ఈనాడు స్థానిక కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. జర్నలిస్టులు, మీడియా కార్యాలయాల మీద దాడులపై జగన్ స్పందించాలని డిమాండ్ చేశారు. దాడులు ఆపకుంటే దేశవ్యాప్త ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
కలెక్టర్‌కు వినతి పత్రం : విజయవాడ అజిత్‌సింగ్ నగర్‌లో తెలుగుదేశం నేతలు నిరసన తెలిపారు. ఒంగోలు కలెక్టరేట్ ఎదుట మీడియా కెమెరామెన్ అసోసియేషన్ జర్నలిస్ట్ సంఘాల నాయకులు ధర్నా చేశారు. కలెక్టరేట్ నుంచి చర్చి సెంటర్ వరకు ర్యాలీ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. గిద్దలూరులోనూ బీజేపీ నేతలు, విలేకరులు నిరసన తెలిపారు.
మీడియా ప్రతినిధులపై దాడి చేయడం వైసీపీ రౌడీ మూకల దుర్మార్గం: అచ్చెన్నాయుడు