Police on BJP Corporator about Rigging Fake Video : కార్పొరేటర్ శ్రవణ్‌కుమార్ సహా మరో ముగ్గుర్ని హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా.. హైదరాబాద్‌లోని బహదూర్‌పురలోని ఓ పోలింగ్ బూత్‌లో రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో వైరల్ చేసిన కేసులో గురువారం వేర్వేరు ప్రాంతాల్లో నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు శ్రవణ్‌ను అదుపులోకి తీసుకున్న తీరు తీవ్ర విమర్శలకు దారి తీసింది. కొందరు కిడ్నాప్ చేసినట్లు ప్రచారం జరిగినా సాయంత్రానికి సైబర్‌క్రైమ్ స్టేషన్‌కు తరలించినట్లు పోలీసులు ధ్రువీకరించారు.
ఎన్నికల సందర్భంగా పాతబస్తీ బహదూర్‌పురలో రిగ్గింగ్ జరుగుతోందంటూ ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఇది వేరే ప్రాంతంలోని పాత వీడియో అని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ వ్యవహారంపై హైదరాబాద్ సైబర్‌క్రైమ్‌లో కేసు నమోదైంది. దర్యాప్తు చేసిన పోలీసులు కార్పొరేటర్ శ్రవణ్‌కుమార్, నాంపల్లికి మహ్మద్ బిన్ అలీ, చాదర్‌ఘాట్‌కు చెందిన కాశీ, ముషీరాబాద్‌కు చెందిన మితిలేష్ వీడియో వైరల్ చేస్తున్నట్లు గుర్తించారు. గురువారం వేర్వేరు ప్రాంతాల్లోని వీరిని అదుపులోకి తీసుకున్నారు.
అయితే శ్రవణ్‌ను అదుపులోకి తీసుకునే సమయంలో వ్యవహరించిన తీరు ఆందోళనకు కారణమైంది. సాయంత్రం 6 గంటల సమయంలో మల్కాజ్‌గిరి ఆనంద్‌బాగ్ సమీపంలోని తన కార్యాలయంలో శ్రవణ్ ఉండగా కొందరు రెండు వాహనాల్లో అక్కడికి చేరుకున్నారు. కొద్దిసేపు శ్రవణ్‌తో మాట్లాడి ఆ తర్వాత బలవంతంగా కారులోకి ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఎక్కడి తీసుకెళ్తున్నారో కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదు.
తొలుత కిడ్నాప్ చేసినట్లు ప్రచారం జరిగింది. దాదాపు 2 గంటల పాటు మల్కాజ్‌గిరిలో హైడ్రామా నడిచింది. బీజేపీ నేతలు కార్యాలయానికి, మల్కాజ్‌గిరి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఆరా తీసినా ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆందోళన రేకెత్తెంచింది. శ్రవణ్ కార్యాలయం సమీపంలోని సీసీ పుటేజీలను గమనించగా పోలీసులు మఫ్టీలో వచ్చినట్లు తేలింది. ఈలోపే తన కుమారుడు శ్రవణ్‌ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని తండ్రి రాంబాబు మల్కాజ్‌గిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాత్రి 8 గంటలకు శ్రవణ్ సహా నలుగురి అరెస్టును సైబర్‌క్రైమ్ పోలీసులు ధ్రువీకరించారు. శ్రవణ్‌ను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తీసుకువెళ్లాలనుకుంటే తమతో చెబితే బాగుండేదని అలా బలవంతంగా తీసుకెళ్లడం ఎంటని శ్రవణ్ కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై బీజేపీ నేతలు స్పందించారు. పోలీసులు రూల్స్ పాటించకుండా విపక్ష నేతలను ఇలా దౌర్జన్యంగా తీసుకెళ్లడం సరికాదన్నారు.