Police Recovery Amount On Cyber Crime Cases : ఒకప్పుడు సైబర్ నేరం జరిగితే నిందితుడిని పట్టుకున్నా డబ్బు తిరిగి రాదనే అభిప్రాయం ఉండేది. కానీ ప్రస్తుతం తెలంగాణ పోలీసులు పోయిన డబ్బును రికవరీ చేసి తిరిగి బాధితులకు అప్పగిస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యధిక సైబర్ నేరాలు నమోదయ్యే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది జనవరిలో 63 కేసుల్లో రూ.2.53 కోట్లను బాధితులకు బ్యాంకు ఖాతాల్లో తిరిగి జమ చేశారు. గతంలోనూ ఇదే తరహాలో సైబరాబాద్ పోలీసులు 44 కేసులకు సంబందించిన రూ.2.23 కోట్లను బాధితుల ఖాతాల్లో జమ చేశారు.
ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు (Cyber Crime Police Telangana)ఒక్క కేసులోనే రూ.34 లక్షలు బాధితుడికి అందజేశారు. మరికొన్ని కేసుల్లోనూ ఇదే తరహాలో నేరస్థుల ఖాతా నుంచి డబ్బును తిరిగి రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిల్లోనూ ఈ ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇన్నాళ్లు మందకొడిగా సాగుతున్న రికవరీ కొత్త విధానంతో మరింత మెరుగవుతోందని అధికారులు వివరిస్తున్నారు.
Cyber Crimes in Telangana : సైబర్ నేరం జరిగిన తర్వాత నిందితులు కొల్లగొట్టిన డబ్బు స్వాధీనం చేసుకోవడం సుదీర్ఘ ప్రక్రియలా ఉండేది. ఒక బాధితుడు సైబర్ ముఠాలకు (Cyber Crimes) డబ్బు బదిలీ చేసిన తర్వాత ఆ సొమ్మును ఇతర ఖాతాలకు బదిలీ చేసే అవకాశం లేకుండా స్తంభింపచేసేవారు. ఆ తర్వాత నిందితులు చిక్కినప్పుడే డబ్బు ఎంతోకొంత రికవరీ చేసేందుకు అవకాశం ఉండేది. దీంతో బాధితులు పోగొట్టుకున్న డబ్బు రికవరీ అసాధ్యంగా ఉండేది.
ప్రజల నమ్మకమే సైబర్ మోసగాళ్లకు పెట్టుబడి - చైనా పరిజ్ఞానంతో జేబులు ఖాళీ
ఈ తరహా నేరాల్లో డబ్బు రికవరీ చేసేందుకు గుజరాత్ పోలీసులు అనుసరిస్తున్న విధానంపై సైబర్‌క్రైమ్ పోలీసులు అధ్యయనం చేశారు. సీఆర్పీసీ చట్టం ప్రకారం కోర్టు ఆదేశాలతో నేరస్థులు చిక్కకపోయినా డబ్బును తిరిగి బాధితులకు అప్పగించే అవకాశమేర్పడుతోంది. దీనిపై అధ్యయనం చేసి గతేడాది నుంచి ఇక్కడా అమలుచేస్తున్నారు. తెలంగాణలో సైబర్ నేరాల ఫిర్యాదుకు ప్రత్యేకంగా 1930 కాల్ సెంటర్ ఉండడం, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రధానంగా ఆన్‌లైన్ మోసాలపైనే పనిచేస్తుండడం రికవరీ ప్రక్రియ వేగంగా జరుగుతోంది.
Telangana Police Action on Cyber Crimes : సైబర్ నేరం జరిగినప్పుడు బాధితులు ఆలస్యం చేయకుండా 1930 ఫిర్యాదు చేస్తే నిందితులు ఉపయోగించిన బ్యాంకు ఖాతాలను ఎన్సీఆర్పీ ద్వారా స్తంభింపజేస్తారు. నిందితులు బాధితుల నుంచి డబ్బు వసూలు చేయగానే సొమ్మును ఇతర ఖాతాలకు బదిలీ చేయడం క్రిప్టో కరెన్సీలోకి మార్చడం వంటివి చేస్తుంటారు. ఈ నేపథ్యంలో మోసం జరిగిన వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలి. ఎన్సీఆర్పీ దేశవ్యాప్తంగా 190 బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వెంటనే నిందితుల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసి డబ్బు ఇతర ఖాతాలకు మళ్లించకుండా చేస్తుంది.
సైబర్ నేరాల్లో తెలుగు యువత - ఇతర రాష్ట్రాల వారితో కలిసి కోట్లు కొల్లగొడుతున్నారు
అనంతరం కేసు నమోదు చేశాక దర్యాప్తు అధికారి సాయంతో బాధితుడు సంబంధిత న్యాయస్థానంలో సీఆర్పీసీ 457 సెక్షన్ ప్రకారం పిటిషన్ దాఖలు చేస్తారు. సైబర్ నేరంలో కోల్పోయిన డబ్బు స్తంభింపచేసిన ఖాతాల్లో ఉందని దాన్ని తిరిగి అప్పగించాలని అభ్యర్థిస్తారు. ఖాతా నుంచి బదిలీ అయిన తీరు ఇతర ఆధారాలను న్యాయస్థానం పరిశీలించి డబ్బు తిరిగి బాధితులకు జమ చేయాలని బ్యాంకుల్ని ఆదేశిస్తుంది. దీన్ని అనుసరించి బ్యాంకులు తదుపరి ప్రక్రియ పూర్తి చేస్తాయి. దీంతో రానున్న రోజుల్లో రికవరీ రేటు మరింత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
98 లక్షలు కొల్లగొట్టి, క్షణాల్లోనే 11 ఖాతాలకు బదిలీ - పోలీసుల చాకచక్యంతో 85 లక్షలు సేఫ్
సైబర్ నేరాల కట్టిడికి కొత్త వ్యూహాలతో సమాయత్తమవుతున్న పోలీసులు