Police Recover 1 crore From Cyber in Nacharam : సైబర్ నేరగాళ్ల మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి ప్రమేయం లేకుండా అతడి ఖాతా నుంచి ఏకంగా రూ.1.10 కోట్లు కొట్టేశారు. అకౌంట్ నుంచి డబ్బులు బదిలీ అయినట్లు మెసేజ్ వచ్చిన నిమిషాల వ్యవధిలో బాధితుడి కుటుంబం బ్యాంకును అప్రమత్తం చేసింది. వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. తక్షణం రంగంలోకి దిగిన పోలీసులు 25 నిమిషాల వ్యవధిలోనే సైబర్ నేరగాళ్లు కొట్టేసిన సొమ్మును వెనక్కి రప్పించారు. ఇదంతా బాధితుడి అప్రమత్తతకు, తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీఎస్‌సీఎస్‌బీ) వెంటనే స్పందించడంతో సాధ్యమైంది. సైబర్ నేరస్థులు కొట్టేసిన సొమ్మును తిరిగి రప్పించడం అంటే గగనమే అనే తరుణంలో ఈ ఉదంతం 'గోల్డెన్ అవర్' ఘనతను చాటిందని పోలీసులు పేర్కొన్నారు.
1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయడంతో : టీఎస్‌సీఎస్‌బీ తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్ నాచారానికి చెందిన హర్ష్ మొబైల్ ఫోన్‌కు ఈ నెల 27న ఉదయం 3 మెసేజ్‌లు వచ్చాయి. ఉదయం 10.09 గంటలకు రూ.50 లక్షలు, 10.10 గంటలకు మరో రూ.50 లక్షలు, 10.11 గంటలకు రూ.10 లక్షలు బాధితుడి ఖాతా నుంచి మరో ఖాతాకు బదిలీ అయ్యాయనేది వాటి సారాంశం. 10.17 గంటల సమయంలో ఆ సందేశాలను చూసిన బాధితుడు ఒక్కసారిగా కంగుతిన్నాడు. తన ప్రమేయం లేకుండా ఏకంగా రూ.1.10 కోట్లు ఇతరుల ఖాతాకు బదిలీ కావడంతో మొదట ఆందోళనకు గురైనా వెంటనే తేరుకున్నారు. కుటుంబసభ్యుల సహకారంతో తొలుత బ్యాంకు అధికారులను అప్రమత్తం చేశాడు. అంతేకాకుండా 10.22 గంటలకు 1930 నంబర్‌కు ఫోన్ చేసి జరిగిన మోసాన్ని వివరించారు.
నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్(ఎన్‌సీఆర్‌పీ) నేతృత్వంలోని సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (సీఎఫ్‌సీఎఫ్‌ఆర్‌ఎంఎస్) సిబ్బంది వెంటనే రంగంలోకి దిగింది. తెలంగాణలో ఈ మోసం జరగడంతో టీఎస్ సీఎస్‌బీ కూడా అప్రమత్తమైంది. వెంటనే నగదు బదిలీ జరిగిన యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీల బ్యాంకుల ప్రతినిధులను అప్రమత్తం చేశారు. అవన్నీ సత్ఫలితాన్నిచ్చాయి. సొమ్మును సైబర్ నేరగాళ్ల ఖాతాల నుంచి డ్రా చేయకుండా నిలిపి వేసినట్లు (Put on hold) బాధితుడి ఫోన్‌కు 10.42 గంటల సమయంలో మెసేజ్ వచ్చింది.
డబ్బు బెంగళూరు ఖాతాలకు బదిలీ : అప్పటికీ నేరస్థులు రూ.10 వేలు డ్రా చేయగలిగారు. డబ్బు బెంగళూరులోని సజావుద్దీన్, సలీముద్దీన్ ఖాతాలకు బదిలీ అయినట్లు దర్యాప్తులో తేలింది. బాధితుడి హర్ష్ ప్రమేయం లేకుండా నగదు బదిలీ ఎలా జరిగిందనే కోణంలో యంత్రాంగం నిమగ్నమైంది. సైబర్ నేరస్థుల వల్ల డబ్బులు పోగొట్టుకున్న వెంటనే తేరుకుని ఫిర్యాదు చేయగలిగితే వెనక్కి తెప్పించేందుకు అవకాశాలున్నాయని చెప్పేందుకు జరిగిన ఈ ఉదంతమే నిదర్శనమని టీఎస్‌సీఎస్‌బీ డైరెక్టర్ శిఖాగోయెల్ అన్నారు.
టీఎస్‌సీఎస్‌బీ యంత్రాంగం తనతో ఫోన్లో మాట్లాడుతూ సమాచారం తెలుసుకుంటున్న సమయంలోనే డబ్బు డ్రా చేయకుండా నిలిపేసినట్లు బ్యాంకు నుంచి మెసేజ్ వచ్చిందని బాధితుడు హర్ష్ తెలిపారు. ఆ సమయంలో తమ ఆనందానికి అవధల్లేకుండా పోయాయని చెప్పారు. టీఎస్‌సీఎస్‌బీ పనితీరును కొనియాడారు.