Vajedu SI Suicide Case Update : ములుగు జిల్లా వాజేడు ఎస్సై రుద్రారపు హరీశ్ ఆత్మహత్య కేసులో కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి. తమ శాఖకు చెందిన యువ అధికారి సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడటాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు దర్యాప్తులో కీలక విషయాలను తెలుసుకున్నట్లు సమాచారం. 7 నెలల కిందట హరీశ్ ఫోన్‌కు ఓ కాల్ వచ్చింది. ఆ కాల్ చేసింది ఓ యువతి. ఫలానా వ్యక్తేనా అంటూ మొదలైన వారి పరిచయంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించింది. అందుకు హరీశ్ కూడా అంగీకరించి ఓకే చేశాడు. అప్పటి నుంచి వారిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్ చేసుకుంటూ దగ్గరయ్యారు.
ఆమె హైదరాబాద్‌లో చదువుకుంటూ వారాంతపు సెలవుల్లో వాజేడుకు వచ్చి రెండు రోజులు అక్కడే ఉండి వెళ్లేది. ఈ క్రమంలోనే వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఎస్సై ఆమె గురించి ఆరా తీశాడు. దీంతో అతనికి కొన్ని విషయాలు తెలిశాయి. ఈ 26 ఏళ్ల యువతిది సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం. ఊళ్లో ఉన్నప్పుడు ముగ్గురు యువకులతో స్నేహంగా ఉండేది. అందులో ఒకరు పెళ్లికి నిరాకరించడంతో చిలుకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు అయింది. ఈ విషయాలను తెలుసుకున్న హరీశ్ ఆమె పెళ్లి ప్రతిపాదనను నిరాకరించాడు. ఇంట్లో వాళ్లు చూసే సంబంధాన్ని చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. అదే విషయాన్ని ఆమెకు చెప్పాడు. దీంతో ఆమె మాట్లాడేందుకు ఆదివారం సాయంత్రం వాజేడు ముళ్ల కట్ట సమీపంలోని ఓ రిసార్టుకు వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఈ క్రమంలో వారిద్దరి మధ్య అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది. సెటిల్మెంట్ చేసుకోవడానికి ఎస్సై ప్రయత్నించగా, సదరు యువతి అందుకు అంగీకరించకపోవడంతో పాటు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని చెప్పింది. దీంతో మనస్తాపానికి గురైన ఎస్సై హరీశ్ తన సర్వీసు రివార్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. తమ కుమారుడి మృతికి యువతే కారణమని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఆమెను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.
అసలేం జరిగిందంటే : ఈ నెల 2వ తేదీన ఎస్సై హరీశ్ వాజేడు మండల కేంద్రానికి సమీపంలో ఉన్న ముళ్లకట్ట గోదావరి బ్రిడ్జి దగ్గర ఉన్న రిసార్ట్‌లోని గదిలో తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అప్పటికే ఎస్సై మృతిపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు. హరీశ్‌కు ఈ నెల 6న నిశ్చితార్థం జరగాల్సి ఉండగా, ఇంతలోనే ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అశ్వారావుపేట ఎస్సై మృతి - ఆ ఐదుగురిపై కేసు నమోదు - Ashwaraopet si died