PM Surya Ghar Scheme Problems in Telangana : ఇటీవల కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన 'పీఎం సూర్యఘర్' పథకానికి రాష్ట్రంలో భారీ ఎత్తున గృహ వినియోగదారులు దరఖాస్తు చేసుకున్నారు. కేంద్రం ఈ పథకానికి భారీ ఎత్తున రాయితీ ప్రకటించడంతో ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు. రాష్ట్రం నుంచి నేషనల్ పోర్టల్‌లో లక్షా 8 వేల 201 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో 62,260 మంది, టీజీఎన్పీడీసీఎల్ పరిధిలో 45,941 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
రిజిస్ట్రేషన్ల అనంతరం దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది. అందులో టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో 8,431 మంది దరఖాస్తులు చేసుకోగా అందులో 3,022 మంది ఫీజుబులిటి పొందారు. వాటిలో కేవలం 1,451 మందికి సోలార్ బిగింపు ప్రక్రియ పూర్తిచేశారు. మరో 1,561 మంది పనులు పూర్తిచేయాల్సి ఉంది. టీజీఎన్పీడీసీఎల్లో రిజిస్ట్రేషన్ల అనంతరం 3,950 దరఖాస్తు చేసుకోగా అందులో ఎంపికైన 862 మంది ఫీజుబులిటీ సాధించారు. వీటిలో 236 మందికి సోలార్ బిగింపు ప్రక్రియ పూర్తిచేశారు. మరో 586 మంది పనులు పూర్తిచేయాల్సి ఉంది.
రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్న జాతీయ బ్యాంకులు : పీఎం సూర్యఘర్ పథకానికి రుణాలు అందించేందుకు దాదాపు అన్నీ జాతీయ బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. 3కిలోవాట్ వరకు ఎలాంటి డాక్యుమెంటేషన్ లేకుండా, ఎలాంటి గ్యారంటీ లేకుండా ఆధార్ కార్డు, పాన్ కార్డ్ తీసుకెళితే బ్యాంకులు 7శాతం వడ్డీతో రుణాలు మంజూరు చేస్తున్నాయి. పీఎం సూర్యఘర్ పథకం కింద మూడు కిలోవాట్ల వరకు రూ. 78,000 వరకు కేంద్రం రాయితీ అందజేస్తుంది. బ్యాంకులు సైతం ఈ రాయితీని మినహాయించుకుని 5 ఏళ్లలోపు సులభ వాయిదాల పద్ధతిలో కట్టుకునే విధంగా వెసులుబాటు కల్పిస్తున్నాయి.
రూ.2,500 నుంచి రూ. 4,000ల వరకు కరెంట్ బిల్లు వచ్చే వారికి ఈ పథకం ఆమోదయోగ్యంగా ఉంటుందని సోలార్ పవర్ అగ్రిగేటర్లు పేర్కొంటున్నారు. పీఎం సూర్యఘర్ పథకం కింద 1కిలోవాట్ కు రూ.30,000ల రాయితీ, 2కిలోవాట్ల వరకు రూ.60,000ల రాయితీ, 3 నుంచి 10 కిలోవాట్ల వరకు రూ.78,000ల రాయితీని కేంద్రం అందజేస్తుంది. గేటెడ్ కమ్యూనిటీ, కామన్ అపార్ట్మెంట్ వాసులకు ఫర్ కిలోవాట్‌కు రూ.18,000ల చొప్పున 500కిలోవాట్ల వరకు రాయితీ అందజేస్తున్నట్లు సోలార్ అసోసియేషన్ సభ్యులు పేర్కొంటున్నారు.
తలెత్తుతున్న సమస్యలు : పీఎం సూర్యఘర్ పథకంలో ప్రధానంగా సాఫ్ట్‌వేర్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ అగ్రిగ్రేటర్లు ఆరోపిస్తున్నారు. తద్వారా దరఖాస్తులు చేసుకున్న వారికి సరైన సమయంలో కనెక్షన్ లభించడం లేదంటున్నారు. కొందరికి కనెక్షన్ వచ్చినా దానికి నెట్ మీటర్ కనెక్టివిటీ లభించడం కష్టసాధ్యంగా మారుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఆ సమస్య పరిష్కారం కోసం ఈఆర్సీ- డిస్కంల అధికారులతో మాట్లాడుతున్నామని తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ అగ్రిగ్రేటర్లు పేర్కొంటున్నారు. సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
సోలార్ రూఫ్‌టాప్స్‌కు భారీగా డిమాండ్ - 30 శాతం పెరిగిన దరఖాస్తులు - Rooftop Solar Scheme