Amrabad Tiger Reserve As Plastic Free Zone : నాగర్‌కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ పులుల అభయారణ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ రహిత జోన్‌గా ప్రకటించింది. జులై ఒకటో తేదీ నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. నిబంధనల ప్రకారం ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ను వినియోగించకూడదు. నీళ్ల బాటిళ్లు, పేపర్ ప్లేట్లు, ఆహార పొట్లాలు ఇవేవీ పులుల అభయారణ్యంలోకి తీసుకువెళ్లేందుకు వీల్లేదు.
హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే మార్గంలో హాజీపూర్ తర్వాత అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రారంభమవుతుంది. శ్రీశైలం వెళ్లే వరకూ నల్లమల అభయారణ్యం నుంచే ప్రయాణం సాగుతుంది. ఈ మార్గం గుండా వెళ్లే ప్రయాణికులు నిత్యం కిలోల కొద్ది ప్లాస్టిక్‌ను మార్గ మధ్యలో వదిలేస్తున్నారు. దీనివల్ల వన్యప్రాణులతోపాటు పర్యావరణానికి హాని కలుగుతోంది.
ప్రస్తుతం అటవీశాఖ ఆధ్వర్యంలో ఎప్పటికప్పడు ఆ చెత్తను ఏరి రీసైక్లింగ్ కోసం ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇకపై అలా కాకుండా అడవిలోకి అసలు ప్లాస్టిక్‌నే అనుమతించకుండా చర్యలు చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం స్థానిక ప్రజలకు, దుకాణాదారులకు, ప్రయాణfకులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. జనం నుంచి సైతం ఈ నిర్ణయంపై సానుకూల స్పందన వ్యక్తమవుతోంది.
"ప్లాస్టిక్ తింటే జంతువులు చనిపోతున్నాయి. వాతావరణానికి కూడా చాలా హాని కలుగుతుంది. ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేయడం మంచిదే. కానీ మరోవైపు కూడా ఆలోచించాలి. ఎందుకంటే దుకాణాదారులు వీటిపై ఆధారపడి ఉన్నారు. అక్కడక్కడ వాటర్ పెట్టాలి. ప్లాస్టిక్ నిషేంధించినప్పుడు దాని ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలి." - పర్యటకులు
ప్లాస్టిక్‌రహిత ఫారెస్ట్‌ల కోసం సర్కారు ప్రత్యేక డ్రైవ్‌లు..
ప్లాస్టిక్ బాటిళ్లకు ప్రత్యామ్నాయంగా గాజు సీసా బాటిళ్లు, పేపర్ ప్లేట్లకు బదులుగా విస్తరాకులు, ప్లాస్టిక్ కవర్లకు బదులుగా జనపనార సంచులు ఏటీఆర్ పరిధిలో చెక్ పోస్టులు, ఇతర ప్రాంతాల్లో అందుబాటులో ఉంచనున్నారు. సరసమైన ధరలకు వాటిని జనం కొనుగోలు చేసుకోవచ్చు. మంచినీటికి జనం ఇబ్బంది పడకుండా మన్ననూరు చెక్‌పోస్ట్, దుర్వాసుల చెక్‌పోస్టు సహా మార్గ మధ్యలో ఆర్ఓ ప్లాంట్లు అందుబాటులోకి తేనున్నారు. దుకాణాల్లోనూ ప్లాస్టిక్ అమ్మకుండా ఇప్పటికే నోటీసులు జారీ చేశారు.
శ్రీశైలం వెళ్లే దారిలో మన్ననూరు, వట్వర్లపల్లి, ఈగలపెంట, దోమలపెంట, పర్హాబాద్ సహా పలు చెంచుపెంటలున్నాయి. ఈ గ్రామాల్లోనూ ప్లాస్టిక్ వస్తువులు వాడకుండా అవగాహన కల్పించనున్నారు. జూలై 1 నుంచి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించేందుకు అటవీశాఖ సహా ఇతర ప్రభుత్వ శాఖలు సన్నద్ధమవుతున్నాయి. శ్రీశైలం పుణ్య క్షేత్రంలో సైతం ప్లాస్టిక్‌పై నిషేధం ఉంది. ఇప్పడు అమ్రాబాద్ పులుల అభయారణ్యంలోనూ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించడం సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్లాస్టిక్ రహిత జాతరే లక్ష్యంగా యువకుడి పాదయాత్ర
'ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చేందుకు వీధి వ్యాపారులు సహకరించాలి'