Telangana Phone Tapping Case Updates : స్పెషల్ ఇంటలిజెన్స్ బ్రాంచ్ కార్యాలయం కేంద్రంగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. గత శానసనభ ఎన్నికల ఫలితాలు వచ్చిన మరునాడే డీఎస్పీ ప్రణీత్‌రావు ఎస్‌ఐబీ కార్యాలయంలోని హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేసి మూసీలో పడేయటం, ఇతర ఎలక్ట్రానిక్ సామగ్రిని మాయం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ అభియోగాలపై కేసులు పెట్టి దర్యాప్తు ప్రారంభించారు.
Phone Tapping Case Investigation After Lok Sabha Polls : ప్రణీత్‌రావు ప్రతిపక్షపార్టీలు, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసిన బండారం బయటపడుతుందన్న ఉద్దేశంతోనే ఆధారాలు ధ్వంసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇవే అభియోగాలపై ఇప్పటి వరకూ నలుగురు పోలీసు అధికారులను అరెస్ట్ చేశారు. మరోవైపు ఎస్‌ఐబీకి నేత్వత్వం వహించిన ప్రభాకర్‌రావు ప్రభుత్వం మారిన వెంటనే రాజీనామా చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన వెంటనే ఆయన అమెరికా వెళ్లిపోయారు.
కేసులో ప్రభాకర్‌రావు పేరు : ప్రభాకర్‌రావు ప్రమేయంతోనే ఇదంతా జరిగిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కానీ ఇప్పటి వరకూ ఎఫ్ఐఆర్‌లో ఆయన పేరు ఇంకా చేర్చలేదు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్రభాకర్‌రావు పేరును కూడా కేసులో చేర్చి అవసరమైతే అరెస్ట్ చేయాలన్నది పోలీసుల ఆలోచనగా తెలుస్తోంది.
Task Force EX OSD Radhakishan Rao Case : ఇదిలా ఉంటే ఫోన్ ట్యాపింగ్ మొదటి దశ దర్యాప్తు పూర్తయ్యేసరికి, రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల హడావుడి మొదలైంది. దీంతో పోలీసులు కూడా ఎన్నికల విధుల్లో తలమునకలయ్యారు. మరోవైపు ఇక మీదట జరిగే దర్యాప్తు అంతా రాజకీయ నాయకులు చుట్టూనే తిరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సమయంలో నేతలను విచారణకు పిలిపిస్తే రాజకీయంగా దుమారం రేగే అవకాశం ఉందని, తద్వారా పరిణామాలు ఎటునుంచి ఎటు దారి తీస్తాయో కూడా తెలియదని ఓ అధికారి అన్నారు.
ఎన్నికల తర్వాత దర్యాప్తు ప్రారంభం : దీనికితోడూ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల ప్రచారంలోనూ ఫోన్ ట్యాపింగ్‌పై రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అందుకే ప్రస్తుతానికి ఈ దర్యాప్తునకు కొంత విరామం ఇచ్చి, ఎన్నికలు పూర్తైన తర్వాత తిరిగి మొదలు పెట్టాలన్నది అధికారుల ఆలోచనగా తెలుస్తోంది. ఈలోపు ఇప్పటి వరకూ జరిగిన దర్యాప్తును పునఃసమీక్షించుకోవడం, నిందితులు దాఖలు చేసుకుంటున్న బెయిల్ పిటిషన్లను వ్యతిరేకించడానికి అవసరమైన సమాచారం సిద్ధం చేసుకోవడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు.
SIB Ex DSP Praneeth Rao Case Updates : మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్వవహరంలో కీలకపాత్ర పోషించిన ప్రణీత్‌రావు ఇజ్రాయెల్ వెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. గూఢచార సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయడంతో ఇజ్రాయెల్ ప్రపంచంలోనే అగ్రస్థానం. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల పోలీసు, భద్రతా బలగాలకు ఈ సాఫ్ట్‌వేర్‌ను ఆ దేశం అమ్ముతుంటుంది. తెలంగాణకు చెందిన పోలీసులు గతంలోనూ అనేక మార్లు ఇజ్రాయెల్‌కు వెళ్లారు. సాధారణంగా ఇలాంటి పర్యటనలకు ఎస్పీ టెక్నికల్, ఆ పైస్థాయి అధికారులు వెళ్తుంటారు. కాని డీఎస్పీ అయిన ప్రణీత్‌రావును కూడా అక్కడికి పంపారంటే అతనికి ఇచ్చిన ప్రాధాన్యం ఏ స్థాయిదో అర్ధం చేసుకోవచ్చు.
మరోవైపు ఫోన్ ట్యాపింగ్‌లో ఆధారాలు దొరక్కుండా చేసేందుకు ప్రణీత్‌రావు ఎస్‌ఐబీ అనేక హార్డ్ డిస్క్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ధ్వంసం చేశాడు. వీటిలో గత కొన్ని సంవత్సరాలుగా ఎస్‌ఐబీ సేకరించిన వామపక్ష తీవ్రవాద సమాచారం కూడా ఉంది. మావోయిస్టుల వ్యూహాలు ఎదుర్కోవాలంటే ఈ సమాచారం చాలా కీలకమని అధికారులు అంటున్నారు. కానీ అతను వాటిని కూడా ధ్వంసం చేయడంతో వామపక్షతీవ్రవాదంపై పోరులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, ఇది దేశ భద్రతకే ముప్పులాంటిదని వారు చెబుతున్నారు.
నిందితులపై ఐటీ చట్టంలోని కేసులు : అందుకే ఈ సమాచారం ధ్వంసానికి సంబంధించి ప్రణీత్‌రావు తదితరులపై పోలీసులు ఐటీ చట్టంలోని సెక్షన్ 66 ఎఫ్, 66 బీ, 65 ప్రయోగిస్తున్నారు. వాస్తవానికి సైబర్ ఉగ్రవాదానికి పాల్పడేవారిపై 66 ఎఫ్ ప్రయోగిస్తుంటారు. కానీ ప్రణీత్‌రావుపై మోపిన అభియోగాల్లోని కొన్ని అంశాలు కూడా సెక్షన్ 66 సెక్షన్‌లకు వర్తిస్తుంది. సమాజానికి నష్టం కలుగుతుందని తెలిసిన తర్వాత కూడా కంప్యూటర్‌లో సమాచారాన్ని చెడగొట్టడం, ధ్వంసం చేయడం, తదితర అంశాలను ఈ సెక్షన్‌కు జోడించారు. మిగతా సెక్షన్‌లను కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రయోగిస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు - విశ్రాంత ఎస్పీ దివ్యచరణ్‌రావును విచారించిన పోలీసులు
ఫోన్ ట్యాపింగ్‌లో కొత్త కోణాలు - పోలీసులే సాక్షులు, వారి వాంగ్మూలాలే ఆధారాలు