Man Involved In More Than 100 Burglaries Arrested In Hyderabad : ప్రముఖ కాలేజీలో మాస్టర్స్ పూర్తి చేశాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి దొంగగా మారాడు. బండి నంబరు ప్లేట్లు, ఒంటిపై చొక్కాలు మార్చుతూ చోరీలకు పాల్పడుతాడు, పోలీసులను ఏమార్చుతాడు. రాజధానిలోని మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో 100కు పైగా చోరీలకు పాల్పడిన మహ్మద్ అవేజ్ అహ్మద్ అలియాస్ అహ్మద్(42)ను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేసి, రూ.10 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఉత్తరమండలం డీసీపీ ఎస్.రష్మి పెరుమాళ్ శుక్రవారం తెలిపారు.
పీడీ యాక్ట్ ప్రయోగించినా మారని తీరు : మలక్‌పేట పరిధి సైదాబాద్ ఇంద్రప్రస్థ కాలనీకి చెందిన మహ్మద్ అవేజ్ అహ్మద్ ప్రముఖ కాలేజీలో ఎంబీఏ పూర్తిచేశాడు. తండ్రి వైద్యశాఖలో ఉన్నతాధికారిగా రిటైర్ అయ్యారు. కాలేజీ రోజుల్లోనే అహ్మద్ జల్సాలకు అలవాటు పడ్డాడు. వాటి కోసం దోపిడీల బాటలో నడిచాడు. మొదటి భార్యకు సంతానం కలగకపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. అతనికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. 2016లో ఇతడిపై పీడీ యాక్ట్ ప్రయోగించినా, ఎన్నిసార్లు జైలుకెళ్లినా పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా అహ్మద్ తీరు మాత్రం మారలేదు. టెక్నాలజీని తెలుసుకుని సీసీ టీవీ కెమెరాలు, వేలిముద్రలు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పటివరకు 114 దొంగతనాలు చేశాడు.
పక్కా ప్లాన్‌తో రంగంలోకి : చోరీ చేసే ముందు ఆ ప్రాంతంలో బైక్‌పై తిరుగుతాడు. ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి వాటన్నింటినీ నోట్ చేసుకుంటాడు. ఇంకెంటంటే మధ్యాహ్నం మాత్రమే తాళం వేసిన ఇళ్లల్లో చోరీలు చేస్తాడు. అపహరించిన వస్తువులను రిసీవర్ల చేతికి ఇచ్చి హోటళ్లు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లు, బంధువుల ఇళ్లల్లో కొద్ది రోజులు మకాం మారుస్తాడు.
ఓ కేసులో అరెస్టై జైలుకెళ్లిన ఇతడు సెప్టెంబరు 5న విడుదలై బయటకు వచ్చాక అతని స్నేహితుడు సలామ్ బిన్‌తో కలిసి కొండాపూర్, టోలిచౌకి, లంగర్‌హౌస్, కార్ఖానా ప్రాంతాల్లో వరస చోరీలు చేశాడు. ఈ నెల 7న కార్ఖానాలోని ఓ ఇంట్లో విలువైన వస్తువులు దొంగలించాడు. కేసు దర్యాప్తు చేపట్టిన ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ బృందం సీసీ కెమెరా ఫుటేజ్‌తో నిందితుడిని గుర్తించారు. చోరీ చేసిన వ్యక్తి బైక్‌ను అద్దెకు తీసుకుని నంబర్ ప్లేట్లు మార్చినట్లు పోలీసులు గుర్తించారు. ఎట్టకేలకు అహ్మద్‌ను అరెస్ట్ చేశారు. మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
హైదరాబాద్‌లో రూ.10కోట్లు లూటీ చేశారు - నిందితులు బెంగళూరులో దొరికారు