People showing Interest for Tour in Dasara Holidays : ఒకవైపు పండుగ రోజులు, పిల్లలకు సెలవులు. మరోవైపు ఇటీవల కురిసిన వర్షాలతో పుడమికి పచ్చని రంగేసినట్లుగా పచ్చదనంతో ప్రకృతి పులకింపు, ఆహ్లాదకరమైన వాతావరణం, నిండుకుండల్లా జలాశయాలు విహారానికి వెళ్లడానికి ఇంతకమించి అనువైన సమయం ఇంకేం ఉంటుంది. పలు పాఠశాలలు దసరా సెలవులు మొదలైన రెండో తేదీ నుంచే పిల్లలను విజ్ఞాన యాత్రలకు తీసుకెళ్లాయి. ఎక్కువగా నార్త్ ఇండియా యాత్రలకు వెళ్లగా, కొన్ని పాఠశాలలు ఇంటర్నేషనల్ టూర్లను సైతం ఏర్పాటు చేశాయి. వృత్తి, ఉద్యోగాలతో బిజీగా ఉన్న తల్లిదండ్రులు సైతం పిల్లలను పాఠశాలలు నిర్వహిస్తున్న ఈ తరహా విహారయాత్రలకు పంపిస్తున్నారు. ఐదారు రోజుల్లో విమానాల్లో వెళ్లి, మళ్లీ పండుగ రోజు నాటికి ఇంటికి వచ్చేలా టూర్ షెడ్యూల్‌ను హైదర్‌గూడలోని ఒక పాఠశాల డిజైన్ చేసింది.
విహారంలోనూ పండుగ..
- దసరా పండుగ ఉత్సవాలను చూసేందుకు ఆ రోజు మైసూర్‌లో ఉండేలా, ఇంకొంత మంది కోల్‌కతా వరకు పయనమవుతున్నారు. ఎక్కువ మంది కాన్పూర్‌లో దసరా వేడుకలు చూసేందుకు ఆసక్తి చూపుతున్నారని ట్రావెల్ సంస్థలు తెలిపాయి.
- ప్రకృతి ఒడిలో గడిపేందుకు, ఒత్తిడికి దూరంగా ఉండేలా దసరా సెలవులు అనువుగా భావిస్తున్నారు. కుటుంబంతో కలిసి కనీసం రెండు నుంచి ఆరు రోజుల విహారానికి వేర్వేరు ప్రాంతాలకు వెళుతున్నారు. ఎక్కువగా నాలుగు రోజుల విహార యాత్రకు మొగ్గు చూపుతున్నారు.
- బడ్జెట్, ఉన్న సమయం ఆధారంగా ఎక్కువగా వికారాబాద్-అనంతగిరి, శ్రీశైలం, తిరుపతి, వరంగల్, విశాఖపట్నం, షిర్డి, గోవా యాత్రలకు వెళుతున్నారు.
- ఉజ్జయిని, లక్షద్వీప్, వారణాసి వరకు ఆధ్యాత్మిక, తీర ప్రాంత సమ్మిళిత యాత్రలను ఎక్కువగా ఇష్టపడుతున్నారని పలు ట్రావెల్ సంస్థలు చెబుతున్నాయి. హైదరాబాద్ నుంచి డొమెస్టిక్ విమాన ప్రయాణాలు పెరగడంతో పర్యాటక జోరు ఎలా ఉందో తెలుస్తోంది.
క్రూజ్ టూర్లకు డిమాండ్ : నగరవాసులు కేవలం ఆధ్యాత్మిక యాత్రలకే కాకుండా జలపాతాల చెంత సరదాగా గడిపేందుకు, జలాశయాల్లో పడవ షికారును కోరుకుంటున్నారు. నాగార్జునసాగర్, సోమశిల, పాపికొండల్లో క్రూజ్ టూర్లకు పర్యాటక శాఖ ప్రణాళికలను సిద్ధం చేసింది. వీటి కోసం చాలా మంది తమను సంప్రదిస్తున్నారని, అటవీ శాఖ నుంచి అనుమతులు రాకపోవడంతో ఎదురు చూస్తున్నామని పర్యాటక శాఖ తెలిపింది.
రిసార్ట్‌లకు బారులు : దసరా వేడుకలు కుటుంబంతో కలిసి రిసార్ట్‌లోనూ జరుపుకునేలా అక్కడే దాండియా, గార్బ ఆడేలా ఏర్పాటు చేసుకునేందుకు తమ రిసార్ట్‌లో బుకింగ్స్ చేసుకుంటున్నారని మొయినాబాద్‌లోని మృగవని రిసార్ట్ నిర్వాహకులు చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే వారిలో ఎక్కువగా రామోజీ ఫిల్మ్‌సిటీ, హుస్సేన్‌సాగర్ పరిసరాలు చూడటానికి ఇష్టపడుతున్నారని పర్యాటక అధికారి ఒకరు చెప్పారు.