Traffic Problems In Sangareddy : 5 నియోజకవర్గాలకు ప్రధాన కేంద్రంగా ఉన్న సంగారెడ్డి పట్టణాన్ని నిత్యం ట్రాఫిక్ సమస్యలు వెంటాడుతున్నాయి. చిరు వ్యాపారులు, దుకాణదారులు ఫుట్‌పాత్‌లపై తమ వస్తువులను పెట్టి అమ్ముకుంటుండడంతో సమస్య తలెత్తుతుందని స్ధానికులు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. జిల్లా ప్రధాన కేంద్రంగా సంగారెడ్డి ఉంది. ఇక్కడ జిల్లా స్థాయిలో అన్ని కార్యాలయాలున్నాయి. దీంతో సంగారెడ్డి నిత్యం రద్దీగా ఉంటుంది. వారి అవసరాల రీత్యా కార్లు, ద్విచక్ర వాహనాల్లో ప్రజలు జిల్లా కేంద్రానికి వస్తుంటారు.
జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్యలు : పట్టణం రద్దీగా ఉండటంతో ఎక్కడ కొంచెం ఖాళీ ప్రదేశం కనిపిస్తే, వాహనదారులు అక్కడ పార్క్ చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. జిల్లాకు నూతనంగా వచ్చిన ఎస్పీ రూపేశ్ ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించి కొంత మేరకు రోడ్డు ప్రమాదాలను అరికట్టారు. కానీ పార్కింగ్ సమస్యలు మాత్రం అలానే ఉన్నాయి. దుకాణాదారులు రోడ్డుపై తమ వస్తువులను పెట్టడంతో సమస్య తలెత్తుతుంది. పైగా పాదచారుల కోసం ఏర్పాటు చేసిన పుట్‌పాత్‌లను పూర్తిగా ఆక్రమించేసి నడవడానికి వీలులేకుండా చేస్తున్నారు.
Traffic Problems Due To Parking : అభివృద్ధిలో భాగంగా పట్టణం విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే రోడ్లూ ఆక్రమణకు గురవుతున్నాయి. రోడ్డుపై ఉన్న క్రాసింగ్ లైన్లను దాటి మరీ వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు. దీనివల్ల ఆ దారి గుండా వెళ్లే వాహనదారులకు ఇబ్బంది కలుగుతోంది. ట్రాఫిక్ పోలీసులు వాహనాలకు చలానాలు రాస్తున్నారే కానీ, ఇలాంటి పార్కింగ్‌పై దృష్టి సారించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి సమస్యలను తీర్చాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
పుట్‌పాత్ ఆక్రమణలపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి అనుమతులను పరిశీలించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. సంగారెడ్డి మీదుగా ఉమ్మడి మెదక్ జిల్లాకు 202 బస్సులు రోజూ రాకపోకలు చేస్తుంటాయి. వీటిలో దాదాపు 12 వేల మంది ప్రయాణిస్తుంటారు. ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల వారు గమ్యస్థానాలకు సకాలంలో చేరుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ట్రాఫిక్ ఏంటి బాబో..య్! - హైదరాబాద్‌లో చుక్కలు చూస్తున్న వాహనదారులు - hyderabad traffic issues