Peddavagu Project Part Broken in Bhadradri : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి సమీపంలోని పెద్దవాగు ప్రాజెక్టుకు పడిన గండి సమీప గ్రామాల ప్రజల జీవితాల్లో తీవ్ర విషాదం నింపింది. ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి అంచనాలకు మించి వరద పోటెత్తింది. ప్రాజెక్టుకు మూడు చోట్ల భారీ గండి పడి వరద ఉప్పెనలా ఊర్లను ముంచేసింది. కుడి కాలువ తూము వద్ద షట్టర్లు ప్రవాహ ఉద్ధృతికి కొట్టుకుపోయాయి.
విద్యుత్, తాగునీరు లేక ఇబ్బందులు : ప్రవాహ ధాటికి వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పలు గ్రామాల ప్రజలు గుట్టలు, ఎత్తయిన భవనాల్లో రాత్రంతా ప్రాణాలు అరచేతపట్టుకుని తలదాచుకున్నారు. ఏం జరుగుతుందో తెలియక ముంపు బాధితులు పరుగులు తీశారు. విద్యుత్, తాగు నీరు లేక ఇబ్బందిపడుతున్నారు. జలవనరుల శాఖ అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం రూ. 150 కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. కొన్నిచోట్ల వరి, మిర్చినారు వరదలకు కొట్టుకుపోయింది.
ఊహించని వరదల కారణంగా అశ్వారావుపేట మండలంలోని వేదాంతపురం, ఊట్లపల్లి, రామన్నగూడెం, పండువారి గూడెం, అనంతారం, గాండ్లగూడెం, కొండతోగు, మల్లాయిగూడెం గుమ్మడవెల్లి, కోయరంగాపురం, నారాయణపురం, బచ్చువారి గూడెం, రంగాపురం గ్రామాలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ముంపు ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించింది. వరద ఉద్ధృతికి వందల ఎకరాల్లో పంటలు కొట్టుకుపోయాయి.
వేలాది ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు : ముంపు గ్రామాల్లో గురువారం మధ్యాహ్నం నుంచి పదుల సంఖ్యలో కరెంట్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు కూలిపోగా కరెంట్ సరఫరా నిలిచిపోయింది. గ్రామాల మధ్య ప్రజా రవాణా నిలిచిపోయింది. రోడ్లు ఎక్కడిక్కడ ధ్వంసమయ్యాయి. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట, ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలాల్లో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వరి, మిర్చి సాగుచేసిన కర్షకులు పొలాల్లో వేసిన ఇసుక మేటలు చూసి లబోదిబోమంటున్నారు. ప్రాజెక్టు నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం వల్లే నిలువునా మునిగామని ఆరోపిస్తున్నారు. ఒక్కో రైతును కదిలిస్తే ఒక్కో దయనీయ గాథ బయటపడుతోంది.
ప్రభుత్వమే ఆదుకోవాలి : పెద్దవాగు ప్రాజెక్టుకు ఆనుకోని ఉన్న గ్రామాల్లోని పలు ఇళ్లల్లో నిత్యావసర సామగ్రి కొట్టుకుపోయింది. ప్రాజెక్టు దిగువనున్న గుమ్మడవెల్లి అతలాకుతలమైంది. పదుల సంఖ్యలో ఇళ్లు కొట్టుకుపోయాయి. నిత్యావసరాలు, బీరువాలు, ఫ్రిడ్జ్‌లు, టీవీలు కొట్టుకుపోయాయి. చీకట్లో చుట్టుముట్టిన వరద నుంచి రక్షించుకునేందుకు ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నారు. కట్టుబట్టలతో మిగిలిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని ముంపు బారిన పడిన ప్రజలు వేడుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 16 వేల ఆయకట్టుకు వర ప్రదాయినిగా ఉన్న పెద్దవాగు ప్రాజెక్టు పూర్తిగా ఆనవాళ్లు కోల్పోయింది. మరో మూడేళ్ల వరకు నీరు నిల్వ చేసే పరిస్థితి ఉండదని అంచనావేస్తున్నారు.
'మా పశువులన్నీ కొట్టుకుపోయాయి - వరద రావడంతో కొండపైన తలదాచుకున్నాం' - Peddavagu Project water leaked