Kaleshwaram Project Investigation Updates : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అవకతవకలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ దర్యాప్తు వేగంగా జరుగుతోంది. ఇవాళ గజ్వేల్ ఈఎన్సీ, కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీ హరిరామ్‌ను విచారించింది. ప్రాజెక్టు నిర్మాణంపై జస్టిస్ పీసీ ఘోష్, ఈఎన్సీ హరిరామ్‌ను 90కి పైగా ప్రశ్నలను అడిగారు. అలాగే ప్రాజెక్టు నిర్మాణ బిల్లుల చెల్లింపులకు ఏర్పాటు చేసిన కాళేశ్వరం కార్పొరేషన్ ఆర్థిక అంశాలపై సైతం కమిషన్ ఆరా తీసింది.
వారి పేర్లు ప్రస్తావన : శనివారం మరోసారి కమిషన్ ముందు హరిరామ్ హాజరుకానున్నారు. ఇవాళ సమాధానం చెప్పని ప్రశ్నలకు రేపు డాక్యుమెంట్స్ సమర్పిస్తామని ఆయన తెలియజేశారు. విచారణలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట హరిరామ్, అప్పటి తెలంగాణ సీఎస్ ఎస్‌కే జోషి, ఈఎన్సీ మురళీధర్ పేర్లను ప్రస్తావించారు. ఇప్పటి వరకు కార్పొరేషన్ ద్వారా బ్యాంకులకు 29,737 కోట్ల రూపాయలు వరకు తిరిగి చెల్లించినట్లు వివరణ ఇచ్చారు. బ్యాంకుల నుంచి తీసుకున్న డబ్బుల్లో 64 వేల కోట్ల రూపాయలు గుత్తేదారులకు చెల్లింపులు జరిగాయని ప్రస్తావించారు.
డ్యామేజీకి అదే ప్రధాన కారణం : కార్పొరేషన్ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్లను ప్రభుత్వానికి ఇచ్చామని, అది శాసనసభలో పెట్టారా? లేదా? అనేది తనకు ఏమీ తెలియదని హరిరామ్ వివరించారు. మేడిగడ్డ బ్యారేజీ డామేజ్‌కు బాధ్యులు ఎవరని ఘోష్ కమిషన్, హరిరామ్‌ను ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో గేట్స్ ఆపరేషన్, మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడమే ప్రధాన కారణమన్న హరిరామ్, 2017 సంవత్సరం నాటి ఉన్నత స్థాయి కమిటీ మినట్స్‌ను కాళేశ్వరం చీఫ్ ఇంజినీర్ ఫాలో కాలేదని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు పీసీ ఘోష్ కమిషన్ ఇప్పటికే కాళేశ్వరం కార్పొరేషన్ చీఫ్ అకౌంట్స్ అధికారులను ప్రశ్నించింది. కమిషన్ ముందు కాళేశ్వరం కార్పొరేషన్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకట అప్పారావు, చీఫ్ అకౌంట్ ఆఫీసర్ పద్మావతి, డైరెక్టర్ ఆఫ్ వర్స్క్ అకౌంట్ చీఫ్ ఫణిభూషణ్ శర్మ హాజరయ్యారు. గతంలో దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా వారి నుంచి పలు వివరాలపై ఆరా తీసింది.