Inquiry on Kaleshwaram Pump Houses : కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ చేస్తున్న పీసీ ఘోష్ కమిషన్ పరిధి మరింత విస్తరించనుంది. ఈ కమిషన్ ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి సాంకేతిక అంశాలపై విచారణ చేపట్టింది. ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన లక్ష్మి, సరస్వతి, పార్వతి పంపుహౌస్‌లు వరద నీటిలో మునగడానికి కారణాలపై విచారణ చేపట్టాలని తాజాగా నిర్ణయించింది.
పీసీ ఘోష్ కమిషన్ విచారణలో భాగంగా ఇందుకోసం ఈఎన్సీ జనరల్, ఈఎన్సీ ఓ అండ్ ఎం, రామగుండం సీఈ, కమిషనర్ ఆఫ్ డిజైన్స్ సీఈ, క్వాలిటీ కంట్రోల్ సీఈతోపాటుగా పంపుహౌస్‌ల ఎస్‌ఈలు, ఈఈలు సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించిన ఇంజినీర్ ఇన్ చీఫ్ ఈఎన్సీ- గజ్వేల్ హరీరాం విచారణకు హాజరుకావాలని కమిషన్ కోరింది. చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ (ఈఎన్సీ- జనరల్ కార్యాలయం) పి.పద్మావతిని కూడా హాజరవ్వాలని పేర్కొంది.
నేటి నుంచి కాళేశ్వరం ఆనకట్టలపై విచారణ తదుపరి ప్రక్రియ ప్రారంభం - 10 రోజుల పాటు సాగే అవకాశం!
పంపుహౌస్‌లు నిర్మించిన గుత్తేదారులు సోమవారం కమిషన్ ముందు హాజరయ్యేలా సమాచారం అందించాలని ప్రొసీడింగ్స్ జారీచేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు కింద అవసరమైన నీటి పరిమాణం ఎంత? ఆ మేరకు పంపుహౌసుల నుంచి నీటిని ఎత్తిపోయడం, నీటి లభ్యత, బ్యారేజీల డిజైన్లు, ప్లానింగ్, నిర్వహణ తదితర అంశాలపై కమిషన్ విచారించనున్నట్లు తెలుస్తోంది. శనివారం నుంచి మలిదశ విచారణ ప్రారంభించిన కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్‌తో, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాతో శనివారం సమావేశం అయ్యారు.
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి దస్త్రాలను రెండు వారాల్లోగా సమర్పించాలని కమిషన్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. జాతీయ ఆనకట్టల భద్రత పర్యవేక్షణ సంస్థ ( ఎన్డీఎస్‌ఏ ) నిర్వహించిన విచారణకు సంబంధించి తుది నివేదికలను సైతం ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. గత నెలలోనే నివేదికలు కోరినా, ఇప్పటివరకు అందకపోవడంపై ఎన్డీఎస్‌ఏ ఛైర్మన్‌తో కమిషన్ మాట్లాడినట్లు తెలుస్తోంది. కమిషన్ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీని, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లనుంచి వివరాలను కోరింది.
అందుకోసం మూడు బ్యారేజీలపై అధ్యయనం చేస్తున్న పుణెలోని సీడబ్ల్యూపీఆర్‌ఎస్ సంస్థకు కమిషన్ ప్రతినిధిని పంపింది. నివేదిక సమర్పించాలని ఆ సంస్థకు సూచించింది. కమిషన్ విచారణకు హాజరైనవారు సమర్పించిన అఫిడవిట్లను, కమిషన్ కార్యాలయ సిబ్బంది క్షుణంగా పరిశీలిస్తున్నారు. అఫిడవిట్లలో పొందుపర్చిన సమాచారంలోని ముఖ్యమైన అంశాల్ని గుర్తిస్తున్నారు. తదుపరి విచారణ అవసరమైతే నోటీసులు జారీచేయనున్నారు.
పంప్ హౌస్ ఇంజినీర్ల విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ నిర్ణయం - Judicial Inquiry On Kaleshwaram