Pawan Kalyan on E waste Recycling in AP : ఏపీలో శాసనసమండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మండలి సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆ రాష్ట్ర మంత్రులు సమాధానమిచ్చారు. ఈ క్రమంలోనే ఏపీలో ఈ వ్యర్థాల తొలగింపునకు తీసుకున్న చర్యలపై ఎమ్మెల్సీలు ప్రశ్నలు వేశారు. వీటికి ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమాధానం ఇచ్చారు. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలోనూ ఈ వ్యర్థాల రీ సైక్లింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని పవన్ తెలిపారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
AP Legislative Council Sessions 2024 : దేశంలో ఈ వ్యర్థాలు అధికంగా ఉత్పత్తి చేసే మొదటి మూడు రాష్ట్రాల్లో ఏపీ లేదని పవన్ కల్యాణ్ తెలిపారు. వీటిని సమర్థంగా తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ వ్యర్థాలను సేకరించి రీ సైక్లింగ్ చేసేందుకు అని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల రీ సైకిల్ యూనిట్లు నెలకొల్పడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలోనూ వీటిని ఏర్పాటు చేస్తామని పవన్ కల్యాణ్ వెల్లడించారు.
మరోవైపు మోనజైట్, సిలికాన్‌ను ప్రైవేట్ ఏజెన్సీలకు అక్రమంగా విక్రయంపై ఎమ్మెల్సీలు ప్రశ్నలు వేశారు. వీటికి ఏపీ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సమాధానమిచ్చారు. గార, భీమిలి బీచ్‌లో అక్రమ తవ్వకాలు జరిగిన మాట వాస్తవమేనని కొల్లు రవీంద్ర చెప్పారు. ప్రైవేట్ ఏజెన్సీలకు కట్టబెట్టి తవ్వకాలు జరిపి దోచుకున్నారని తెలిపారు. గోపాలకృష్ణ ద్వివేది, వెంకటరెడ్డి స్వయంగా వెళ్లి ఒప్పందాలు చేసుకున్నారని ఆయన ఆరోపించారు.
సీబీసీఐడీ విచారణ జరపాలని ఏపీ సీఎంను కోరాం: రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల అక్రమంగా గనుల తవ్వకాలు జరిగాయని కొల్లు రవీంద్ర తెలిపారు. గనుల శాఖలో మైనింగ్ ద్వారా రూ.20,000ల కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు. గత అధికార పార్టీ నేతలు అక్రమ మైనింగ్ చేస్తూ దోచుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం అన్ని చోట్లా డిపార్ట్మెంటల్ విచారణ జరుగుతోందని పేర్కొన్నారు. ఇందులోని దోపిడీ తేల్చేందుకు సీబీసీఐడీ విచారణ జరపాలని ఏపీ సీఎంను కోరామని వివరించారు. ముఖ్యమంత్రి ఆదేశిస్తే సీబీసీఐడీ విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు.