Viral Fever Effect at Sultanabad Hospital : రాష్ట్రంలో వైరల్ జ్వరాలతో ప్రజలు విలవిలలాడుతున్నారు. తాజాగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి శుక్రవారం సుమారు 400 మంది జ్వర పీడితులు పోటెత్తారు. ఉదయం 10 గంటలకు ఆస్పత్రిలో ఓపి ప్రారంభం కాగా గంటన్నర వ్యవధిలోనే 400 మంది వరకు ఆసుపత్రికి వచ్చారు. ఏం చేయాలో తెలియక వైద్య సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. ఓపీ కోసం పేర్లు నమోదు చేసుకునేందుకు జ్వర పీడితులు గంటల తరబడి క్యూలైన్లో నిలబడడంతో ఆసుపత్రి ఆవరణ కిక్కిరిసిపోయింది. మరోవైపు జ్వరం అధికంగా ఉన్న వారు లైన్లో నిలబడే శక్తి లేక దొరికిన చోటే కుప్పకూలిపోయారు.
ఒక దశలో వైద్యులతో పరీక్షలు చేయించుకునేందుకు తోపులాట జరిగినంత పని అయ్యింది. ఆసుపత్రిలో ఇన్ పేషెంట్లు 30కి పైగా ఉండడంతో కొత్తగా జ్వరం వచ్చిన వారిని చేర్చుకునేందుకు వైద్యులు నిరాకరించారు. ఆసుపత్రిలో బెడ్స్ లేవని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి వెళ్లాలంటూ సూచించారు. ఈ విషయం తెలుసుకున్న పెద్దపల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ప్రమోద్ కుమార్ ఆసుపత్రికి చేరుకొని పరిసరాలను పరిశీలించారు. ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా జ్వర పీడితుల సంఖ్య పెరిగిందని వైద్య ఆరోగ్యశాఖ అధికారి ప్రమోద్ కుమార్ తెలిపారు.
జ్వర పీడితుల సంఖ్య పెరగడంతో : ఓపీ కోసం ఆస్పత్రికి వచ్చేవారికి సరైన వైద్యం అందించాలని సిబ్బందిని వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశించారు. ఆస్పత్రిలో అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయని, జ్వర పీడితుల సంఖ్య పెరగడంతో కొంత ఇబ్బంది కలిగిందని చెప్పారు. మరోవైపు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చేస్తున్న దాడులను నిలిపివేయాలంటూ పెద్దపెల్లి జిల్లావ్యాప్తంగా వైద్యులు గురువారం నుంచి వైద్య సేవలను నిలిపివేస్తూ నిరసన బాటపట్టారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రులకు జ్వర పీడితుల తాకిడి పెరిగింది. స్థానికంగా నెలకొన్న ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆస్పత్రికి వచ్చిన బాధితులు వేడుకుంటున్నారు.
'రాష్ట్రంలో వైరల్ జ్వరాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సుల్తానాబాద్‌లోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి భారీ సంఖ్యలో పేషెంట్లు వచ్చారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలిస్తున్నారు. జ్వర పీడితులకు సరైన వైద్యం అందిస్తున్నారు. ఆస్పత్రిలో అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయి'- ప్రమోద్ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ అధికారి