GHMC Focus On Play Grounds Devt : 'కోటి మంది నివసించే రాజధానిలో చిన్నపిల్లలు ఆడుకునేందుకు సరైన పార్కులు లేవు. చెట్లు, కుర్చీలు, చుట్టూ వాకింగ్ ట్రాక్‌లు మాత్రమే అనే అభిప్రాయానికి అధికారులు అతుక్కుపోయారు. ఆ భావన నుంచి జీహెచ్‌ఎంసీ బయటపడాలి. చిన్నారుల జీవితంలో ఆటపాటలనేవి భాగం కావాలి. అందుకు బల్దియా బాధ్యతను తీసుకోవాలి. ఎకరం, అంతకు మించి విస్తీర్ణమున్న అన్ని పార్కుల్లో పిల్లలు ఆడుకునేందుకు తగిన వసతులు ఏర్పాటు చేయాలి.’ అని ఇటీవల నిర్వహించిన ఓ సమావేశంలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.
క్రీడా ప్రాంగణాలుగా పార్కు స్థలాలు : సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో పార్కుల అభివృద్ధికి జీహెచ్‌ఎంసీ పార్కుల విభాగం చర్యలు చేపట్టింది. త్వరలోనే క్రీడా వసతులను ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. కేపీహెచ్‌బీ రోడ్డు నం.1, యూసఫ్‌గూడతో పాటు జూబ్లిహిల్స్ తదితర ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ పార్కు స్థలాలు క్రీడా ప్రాంగణాలుగా మారాయి. జీహెచ్‌ఎంసీనే అక్కడ క్రీడా వసతులను అభివృద్ధి చేసి వాటి నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించింది. అదే అదనుగా కొందరు అధిక రుసుములను వసూలు చేస్తున్నారు.
పార్కు స్థలంలో ఆక్రమణలు తొలగింపు : ఇటీవల కావూరి హిల్స్ పార్కు స్థలాన్ని కాలనీ సంఘమే ప్రైవేటు వ్యక్తులకు 25ఏళ్లపాటు లీజుకిచ్చిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లీజుకు తీసుకున్న సదరు ప్రైవేటు వ్యక్తి పార్కులో టెన్నిస్, వాలీబాల్, ఇతరత్రా క్రీడా వసతులను అభివృద్ధి చేసి అధిక ఛార్జీలను వసూలు చేయడం ప్రారంభించారు. స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా రంగంలోకి దిగి అక్రమంగా నిర్మించిన షెడ్లను తొలగించి పార్కును రక్షించింది.
వాకింగ్‌కు ఉపయోగపడుతున్న పలు పార్కులు : బంజారా చెరువు వద్దనున్న ఎమరాల్డ్ స్వీట్ షాప్ ఎదురుగా త్రిభుజాకారంలో చిన్న పార్కు ఉంటుంది. అందులో మొక్కలు నాటి, రెండు బెంచీలను వేసి జీహెచ్‌ఎంసీ అధికారులు చేతులు దులిపేసుకున్నారు. ఖైరతాబాద్ సర్కిల్‌లోని నవీన్‌నగర్ ప్రధాన రహదారిపై చిన్నపాటి త్రిభుజాకారంలో ఉన్న ఖాళీ స్థలం చెత్త కుప్పగా మారింది. ఆనంద్‌నగర్‌కాలనీ, వెంకటరమణకాలనీ, పద్మకాలనీల్లోని పార్కులన్నీ స్థానికులకు ఉదయం, సాయంత్రం నడకకు ఉపయోగపడుతున్నాయి.
బంజారాహిల్స్ మర్రిచెన్నారెడ్డి మానవవనరుల కేంద్రం(ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ) వద్ద బటర్‌ఫ్లై పార్కుకు ఇటీవలి వరకు ఉదయం 10గంటలకే తాళం వేసేవారు. పక్కనున్న ఓబుల్ రెడ్డి పాఠశాలలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు జీహెచ్‌ఎంసీకి ఈ విషయంపై ఫిర్యాదు చేయడంతో సిబ్బంది పగటి పూట తాళం వేయట్లేదు.
పిల్లల పార్క్ స్థలం అక్రమ రిజిస్ట్రేషన్ - ఆందోళనకు దిగిన కమ్యునిటీ వాసులపై దౌర్జన్యం