Parakala Amaradhamam Story :సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజల జీవితాల్లో ఆనందాన్ని, స్వేచ్ఛా వాయువులను నింపిన రోజు. భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వస్తే నిజాం ఏలుబడిలో ఉన్న తెలంగాణకు సరిగ్గా 13 నెలల తర్వాత సెప్టెంబర్ 17, 1948న స్వాతంత్య్రం వచ్చింది. నిరకుంశత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించి స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు పొందడం కోసమే నాడు వేలాది మంది పోరాటయోధులు అసువులు బాశారు. రక్తం ధారులుగా చిందించి రజాకార్లను తరిమికొట్టారు. నాటి రజాకార్ల అకృత్యాలకు సాక్షీభూతం వరంగల్ జిల్లా పరకాలలోని అమరధామం. నాడు రజాకార్ల నరమేధానికి పరకాలలో రక్తపుటేరులు పారాయి.
నిజాం నిరంకుశానికి నిలువెత్తు రూపం : హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో కలపాలని పరకాల ప్రాంతంలో సాగిన స్వాతంత్య్ర పోరాటంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉద్యమంలో భాగంగా 1947 సెప్టెంబరు 2న పరకాలలో చాపల బండ విశాల మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగురవేయడానికి వివిధ గ్రామాల ప్రజలు ఒక్క చోటికి చేరుకున్నారు. అయితే వీరంతా ఖజానా కొల్లగొట్టడానికి వస్తున్నారనే తప్పుడు సమాచారంతో నాటి సర్కిల్ ఇన్స్పెక్టర్ జీయాఉల్లా నేతృత్వంలో రజాకార్లు విచక్షణా రహితంగా కాల్పులు, లారీఛార్జ్ చేయటంతో పరకాల ప్రాంతం మరుభూమిగా మారింది.
1947 సెప్టెంబర్ 2న పరకాల మైదానంలో రక్తపుటేరులు పారాయి. మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన ఆకుతోట మల్లయ్య, వీరయ్య, ఎండీ రాజ్ మహమ్మద్‌లను చెట్టుకు కట్టేసి రజాకారులు అతి దారుణంగా కాల్చి చంపారు. ఈ దుర్ఘటనలో వందలాది మంది క్షతగాత్రులయ్యారు. 1948 సెప్టెంబరు 17న తెలంగాణ ప్రాంతానికి రజాకార్ల నుంచి విముక్తి లభించింది. అమరులైన ప్రదేశంలో వారి జ్ఞాపకార్ధం పరకాల నడిబొడ్డున అమరధామం పేరుతో స్మారక స్తూపాన్ని నిర్మించారు.
ఈ అమర ధామాన్ని చెన్నమనేని చంద్రమ్మ ట్రస్టు 2003లో పరకాల పురపాలక సంఘం కార్యాలయ భవనం వెనకాల నిర్మించారు. నిజాం మూకల దౌర్జన్య కాండను తెలియచేసే విధంగా రూపుదిద్దుకున్న శిల్పాలు ఆనాటి ఘటనను కళ్ల ముందు కదలాడేలా చేస్తాయి. నాటి రజాకార్ల అకృత్యాల గురించి తలుచుకుంటూ చెమ్మగిల్లిన కళ్లతో నాటి చేదుజ్ఞాపకాలను ఇప్పటికీ స్థానికులు గుర్తు చేసుకుంటూనే ఉంటారు. తాడిత, పీడిత జనం స్వేచ్ఛ కోసం చేసిన సమరంలో రాక్షస రజాకార్లు మరు భూమిగా మార్చిన పరకాల చరిత్రలో ఎప్పటికీ ధృవతారగా నిలిచిపోతోంది. నాటి రజాకార్ల దారుణ మారణ కాండకు సాక్ష్యంలా నిలిచే పరకాల అమరధామం భవిష్యత్ తరానికి ఎప్పటికీ స్ఫూర్తిధామమే.
Parakala Amaradhamam : నాటి అమరవీరుల త్యాగాలకు గుర్తుగా పరకాల అమరదామం.. ఈ విశేషాలు తెలుసా..?