Papikondalu Tour Start in AP : చుట్టూ ఎత్తైన కొండలు. కనుచూపు మేర పచ్చదనం. అలలుగా పొంగి నురగలై పారుతూ ఉరకలెత్తే గోదావరిని చూస్తే ఎవరి మనసు మాత్రం పరవశించకుండా ఉంటుంది. అటువంటి అందాల గోదారమ్మను కనులారా వీక్షించి, మనసారా ఆస్వాదించే సమయం దగ్గరపడుతుంది. ఇలాంటి మనోహరమైన దృశ్యాలు పాపికొండల విహార యాత్రలో కనిపిస్తాయి. ఈ టూర్ ప్రకృతి ప్రేమికులను పరవశింపజేస్తోంది. దీంతో చాలా మంది సందర్శకులు మళ్లీ పాపికొండల్లో విహారయాత్ర ఎప్పుడు స్టార్ట్ అవుతుందా? అని ఎదురుచూస్తున్నారు. అలాంటి వారందరికీ గుడ్ న్యూస్.
రెండు రోజుల కిందట పాపికొండల విహారయాత్రకు ఏపీ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం, వి.ఆర్.పురం మండలం నుంచి విహారయాత్ర బోట్లు పర్యాటకులను తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. మొన్న వరదలతో నదీ చెంతకు పోలేని పరిస్థితుల నుంచి ఇప్పుడు నదిలో విహరించే వాతావరణం ఏర్పడింది. నదికి ఇరువైపులా విస్తరించి ఉన్న పాపికొండల పర్వతశ్రేణుల నడుమ హొయలొలుకుతూ, వయ్యారాలు పోతూ సాగే నదీ ప్రవాహాన్ని చూసేందుకు పర్యాటకులు పోటెత్తనున్నారు.
ఎన్నో ఉపనదులను తనలో కలుపుకొని వరదల సమయంలో ఉగ్రరూపం దాల్చి, సువిశాలంగా కనిపించే గోదావరి నది పాపికొండలు వద్దకు వచ్చేసరికి ఒదిగిపోయి ఓ చిన్నవాగులా మారిపోతుంది. వీటిని చూసి పర్యాటకులు పరవశం చెందుతుంటారు. ఈ టూర్కు వెళ్లాలనుకున్న వారికి వి.ఆర్.పురం మండలం పోచవరం రేవు నుంచి 21 బోట్లు, దేవీపట్నం మండలం పోశమ్మగండి రేవు నుంచి 12 బోట్లు అందుబాటులో ఉన్నాయి.
సేద తీరేది ఇక్కడే : పర్యాటకులు పాపికొండల్లో విహరించి కాసింత సేదతీరే ప్రాంతం పేరంటాలపల్లి. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో ఉన్న ఈ కుగ్రామానికి పర్యాటకంగా పెద్దపేరు. ఈ విహారంలో అలసిపోయిన పర్యాటకులను బోట్లు ఈ గ్రామానికి చేర్చుతాయి. అక్కడ జలపాతంలో స్నానాలు ఆచరించి, సమీపంలోని మునివాటాన్ని సందర్శించి, అక్కడ కొండరెడ్లు తయారు చేసే వెదురు కళాకృతులను కొనుగోలు చేసి, తిరుగు ప్రయాణం అవుతుంటారు. ఇక పర్వతశ్రేణులు ఏలూరు, అల్లూరి జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి.
బోటింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలి : ఈ విహారయాత్రలో అత్యంత ప్రాముఖ్యం ఉన్న ఏలూరు జిల్లాలో బోటింగ్ పాయింటు లేకపోవటం పెద్ద వెలితి. పోలవరం, వేలేరుపాడు మండలంలోని కోయిదాలలో బోటింగ్ పాయింట్లు ఏర్పాటుచేయాలనే అభ్యర్థనలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని పోలవరం, కోయిదాలకు పాపికొండలు నుంచి త్వరగా చేరుకోవచ్చు. ఇక్కడ బోటింగ్ కేంద్రాలు ఏర్పాటుచేస్తే ఆంధ్రా, తెలంగాణ నుంచి వచ్చే పర్యాటకులకు అనువుగా ఉంటుంది.
అరకు టూర్కు వెళ్తున్నారా? - ఇది తప్పక ట్రై చేయండి
అలా "సోమశిల" చూసొద్దామా - తక్కువ ధరకే తెలంగాణ టూరిజం సూపర్ ప్యాకేజీ - పైగా శ్రీశైలం చూడొచ్చు!