Telangana Panchayat Elections 2024 : తెెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికలు ఎప్పుడైనా ఉండవచ్చనే సంకేతాలు ఉండటంతో అధికార యంత్రాంగం ముందస్తుగా అన్ని ఏర్పాట్లు సిద్దం చేస్తుంది. ఇప్పటికే ఓటర్ల జాబితాను గ్రామాలు, వార్డుల వారీగా సిద్దం చేయగా, తాజాగా కొత్త పేర్లను వార్డుల వారీగా సేకరిస్తున్నారు. మరోవైపు ఓటర్లకు సరిపడా బ్యాలెట్ పత్రాల ముద్రణ కోసం కసరత్తు మొదలుపెట్టారు. బ్యాలెట్ పేపర్ అధికారులే సరఫరా చేస్తుండగా, దానిపై గుర్తులు మాత్రం ప్రైవేటు ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో ముద్రిస్తారు.
బ్యాలెట్ పత్రాల ముద్రణకు కసరత్తు : బరిలో నలుగురు ఉన్నట్లు, అయిదుగురు, పది మంది ఉన్నట్లు, ఇలా గుర్తులతో ముందస్తుగానే ముద్రించుకొని సిద్ధంగా ఉంచాలా? లేక అభ్యర్థులు బరిలో ఉన్నట్లు తేలాక ముద్రించాలా అనే దానిపై ఉన్నతస్థాయిలో చర్చలు జరుగుతుండటంతో ఆ ఆదేశాల కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. అప్పటి వరకు అందుబాటులో ఉన్న ప్రింటింగ్ ప్రెస్‌ల వివరాలను తీసుకుంటున్నారు. బ్యాలెట్ బాక్సులకు మరమ్మతులు చేసేందుకు మండలాల్లో నిల్వ ఉంచిన బాక్సులను జిల్లా కేంద్రానికి తెప్పిస్తున్నారు. మొత్తానికి అన్ని ఏర్పాట్లు చేస్తుండటంతో ఎన్నికలు ఎప్పుడుంటాయనే దానిపై అందరి దృష్టి పడింది.
మూడు విడతలుగా ఎన్నికలు : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి వార్డుకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 1200 ఓటర్ల వరకు ఒక కేంద్రం ఉండగా, అదే పంచాయతీకి వచ్చే సరికి వంద ఓటర్ల కంటే తక్కువగా ఉన్నా ఆ వార్డుకు పోలింగ్ కేంద్రం అందుబాటులో ఉంచాలి. అందుకే సిబ్బంది ఎక్కువగా అవసరం. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని పలుచోట్ల మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వానికి ఇంతకు ముందే ప్రతిపాదనలు పంపించారు. గ్రామ పంచాయితీ ఎన్నికలపై ఆదిలాబాద్ జిల్లా పంచాయతీ అధికారి శ్రీలత ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నామని పేర్కొన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్దంగా ఉంటామని తెలిపారు.
గత ఫిబ్రవరి 1వ తేదీతో పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు రావడంతో పంచాయతీ ఎన్నికలు వాయిగదా పడ్డాయి. మళ్లీ జూన్లో పంచాయితీ ఎన్నికలు ఉంటాయని అనుకుంటే కులగణన చేస్తున్న నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు మరింత ఆలస్యమయ్యాయి.
పంచాయతీ ఓటర్ల తుది జాబితా విడుదల - మీ పేరు ఇలా చెక్ చేసుకోండి - State Election Commission