Palamuru-Rangareddy Lift Irrigation Project Works : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జలప్రదాయని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు వేగం పుంజుకుంటున్నాయి. గత ప్రభుత్వం ఒక మోటారు ద్వారా శ్రీశైలం వెనుక జలాల నుంచి అంజనగిరి జలాశయంలోకి 2 టీఎంసీల ఎత్తిపోసి పాలమూరు రంగారెడ్డి పథకాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత సర్కార్ మారడంతో పథకం పనులు ఆగిపోయాయి. రూ. 32వేల 500 కోట్ల అంచనాతో 2015లో పనులు ప్రారంభించగా ఆ తర్వాత అంచనా వ్యయాన్ని రూ. 55వేల కోట్లకు సవరించారు. 2023 డిసెంబర్ నాటికి 40 శాతం వరకు పని చేసి రూ. 24వేల కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వీలైనంత త్వరగా పాలమూరు పథకాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులపై సమీక్షించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మినహా మిగిలిన పెండింగ్ ప్రాజెక్టులను ఏడాదిన్నరలో పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. రానున్న ఐదేళ్లలో పాలమూరు రంగారెడ్డి ద్వారా పూర్తి ఆయకట్టు 12లక్షల 30వేల ఎకరాలకు సాగునీరు అందించేలా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బడ్జెట్‌లో పాలమూరు రంగారెడ్డికి రూ.1248కోట్లు కేటాయించడంతో పనుల్లో వేగం పుంజుకుంది.
నార్లాపూర్ పంపుహౌజ్‌లో 9 మోటార్లు : నార్లాపూర్ పంపుహౌజ్‌లో 9 మోటార్లు ఏర్పాటుచేయాల్సి ఉండగా ఇప్పటికే ఒకటి ప్రారంభించారు. రెండు, మూడో మోటార్లు డ్రైరన్‌కోసం సిద్ధమైంది. నాలుగో మోటారును అక్టోబర్ వరకి సిద్ధంచేయనున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే ఈనెలలోనే రెండో మోటారు ట్రయల్ రన్ చేపట్టే అవకాశం ఉంది. కొత్తగా నిర్మించిన అంజనగిరి జలాశయంలో గతేడాది 2 టీఎంసీలు నిల్వ చేశారు. ఈ సెప్టెంబర్‌లో మరో 2టీఎంసీలు నింపాల్సి ఉంది. ఏడాదికి 2 టీఎంసీల చొప్పున 6.51 టీఎంసీలు పూర్తి స్థాయిలో నిల్వ చేయాల్సి ఉంటుంది. ఈసారి భారీ వరద రాగా శ్రీశైలం నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నీళ్లున్నప్పుడే నార్లాపూర్ జలాశయానికి 2టీఎంసీలు తరలిస్తే సాగుకు కాకపోయినా తాగునీటికైనా వినియోగించుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఏదుల జలాశయానికి వెళ్లే ప్రధాన కాల్వ పనులు : పాలమూరు పథకంలో నార్లాపూర్ తర్వాత ఏదుల జలాశయం నింపాల్సి ఉంది. ఏదుల జలాశయం పనులు ఇప్పటికే 90 శాతం వరకు పూర్తి కాగా నీళ్లు నింపేందుకు అవకాశం ఉంది. కానీ నార్లాపూర్ నుంచి ఏదుల జలాశయానికి వెళ్లే ప్రధాన కాల్వ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. అంజనగిరి జలాశయం నుంచి కుడికిల్ల, తిర్నాంపల్లి మీదుగా సాతాపూర్‌వైపు సొరంగం వరకు 8 కిలో మీటర్ల మేర కాల్వ నిర్మాణ పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఆ కాల్వ మధ్యలో 4 వంతెనలు నిర్మించాలి. కుడికిల్ల, తిర్నాంపల్లి దగ్గర కాల్వ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఆ గ్రామాల మధ్యలో నార్లాపూర్ వైపు వెళ్లేందుకు కాల్వపై వంతెన నిర్మించాల్సి ఉంది. కాల్వ నిర్మాణంలో భూములు ముంపునకు గురైన రైతులకు పూర్తిస్థాయిలో పరిహారం అందలేదు. ఆ పనులు పూర్తి చేస్తేనే ఏదుల జలాశయానికి సాగునీరు అందుతుంది.
పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల అనుమతి కోసం ప్రభుత్వం ప్రయత్నాలు