Paddy Procurement Issues in Telangana : హనుమకొండ జిల్లా పరకాలలో బుధవారం అర్థరాత్రి కురిసిన వర్షానికి వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం తడిసిపోయింది. వరద ధాటికి వడ్లు కొట్టుకుపోయాయి. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ రైతులు వేడుకున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర, లక్ష్మీదేవి పల్లెలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. రైతులకు ఇబ్బందుల్లేకుండా వడ్లు కొనాలని ఆదేశించారు.
ధాన్యం కొనుగోళ్లు చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామాజీపేటలో రైతులు రోడ్డెక్కారు. కొనుగోళ్లలో జాప్యంతో అకాల వర్షాలకు ధాన్యం తడిసి నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వడ్లు కొనాలని నినానాదాలు చేశారు. సమస్య పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వటంతో రైతులు ఆందోళన విరమించారు.
Harish Rao Visit Crop Loss Areas : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మాజీ మంత్రి హరీశ్‌రావు రైతులతో మాట్లాడారు. అకాల వర్షాలకు వడ్లు తడిసిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమలాపూర్‌లో తడిసిన ధాన్యాన్ని బీఆర్ఎస్ నేతలతో కలిసి హరీశ్‌రావు పరిశీలించారు. రోజుల తరబడి వేచి చూస్తున్నా వడ్లు కొనడం లేదని రైతులు తెలిపారు. తడిచిన ధాన్యం మొలకెత్తిందని వివరించారు. క్షేత్రస్థాయిలో రైతులు కష్టాలు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వడ్లు కొనుగోలు చేస్తున్నామని అసత్యాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు.
"కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాలు వచ్చి రోజులు గడుస్తున్నా వడ్లు కొనుగోలు చేయలేదు. ఈ ప్రభుత్వం హైదరాబాద్‌లో కూర్చుని చెబుతున్న మాటలు మాత్రం కోటలు దాటుతున్నయి. ఎక్కడ చూసినా వడ్లు తడిసి ఉన్నాయి. మంత్రులతో పాటు అధికారులు క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాలను పరిశీలించి వెంటనే వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాను."- హరీశ్‌రావు, మాజీ మంత్రి
Kishan Reddy Talk with Farmers : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రాఘవాపూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సందర్శించారు. తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించి అన్నదాతల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తోందని ఎద్దేవా చేశారు. రైతులు పంట పెట్టుబడి పెట్టేందుకు డబ్బు లేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు.