Paddy Procurement Centers In Telangana : నిత్యం శ్రమించాలి పంట పండించాలి ధాన్యం అమ్మాలి డబ్బులు చేతికందాలి ఇదే ఏ రైతు ఆలోచననైనా. అందుకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు భరోసా కల్పిస్తాయి. ఈ క్రమంలోనే యాసంగి ధాన్యం కొనుగోళ్లకు పౌరసరఫరాల సంస్థ చర్యలు తీసుకుంటుంది. కాగా ఇప్పటికే రాష్ట్రంలో ఎంత ధాన్యం కొనుగోలు చేయాలనే లక్ష్యాన్ని ఏర్పరచుకుంది. ఈ మేరకు జిల్లాల వారీగా కొనుగోలు లక్ష్యాలు ఖరారయ్యాయి. హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో 7 వేల 149 కొనుగోలు కేంద్రాల ద్వారా 75.40 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనాలని పౌరసరఫరాల సంస్థ లక్ష్యం పెట్టుకుంది.
ఈ లక్ష్యాలు సాధించేందుకు అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. తర్వాత స్థానాల్లో జగిత్యాల, నల్గొండ, కామారెడ్డి, మెదక్, యాదాద్రి జిల్లాలు ఉన్నాయి. నిజామా బాద్ తర్వాత జగిత్యాలలో 5.88లక్షల టన్నుల ధాన్యం, నల్గొండలో 5.26లక్షల టన్నుల ధాన్యం, కామారెడ్డిలో 4.65 లక్షల టన్నులు, మెదక్‌లో 4.38లక్షల టన్నులు, యాదాద్రిలో 4.16 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయా జిల్లాల అధికారులకు పౌరసరఫరాల సంస్థ లక్ష్యాన్ని నిర్దేశించింది.
యాసంగి ధాన్యం సేకరణపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ - 7,149 కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు - Govt Focus On paddy Procurement
Government Focus On paddy Procurement : కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు రాష్ట్రంలో ఏప్రిల్ 1 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు మొదలు కావాల్సి ఉంది. నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో మార్చి మొదటివారంలోనే వరికోతలు మొదలయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనతో నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో ముందే ధాన్యం కొనుగోళ్లకు కేంద్రం అనుమతించింది. ఈ జిల్లాల్లో మొత్తం 836 కొనుగోలు కేంద్రాలకు గాను అవసరమైన ప్రాంతాల్ని గుర్తించి 19 కేంద్రాలను గురువారం ప్రారంభించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో కొనుగోలు కేంద్రాలను ఎన్నికల నియమావళికి అనుగుణంగానే ప్రారంభిం చాలని మూడ్రోజుల క్రితం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు.దీంతో నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో కలెక్టర్, అదనపు కలెక్టర్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు.
CS Review On Paddy Procurement Centers : ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మేడ్చల్, నారాయణపేట, రంగారెడ్డి జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల సంఖ్య తక్కువగా ఉంది. ఈ జిల్లాల్లో మొత్తం 257 కొనుగోలు కేంద్రాల ద్వారానే కొనుగోళ్లు జరగనున్నాయి. ఇందుకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మేడ్చల్, నారాయణపేట, రంగారెడ్డి జిల్లాల్లో ధాన్యం ఉత్పత్తి తక్కువగా ఉండటమే కారణం. కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు ధాన్యం రవాణా వాహనాలు, గన్నీ టెండర్లను ఖరారు చేసేందుకు అనుమతి కోసం ఎన్నికల కమిషన్‌కు పౌరసరఫరాల సంస్థ లేఖ రాసింది. ఎండల తీవ్రత నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో తాగునీటి సరఫరా, టెంట్లు, చలువ పందిళ్లు వంటి ఏర్పాట్లు చేయాలని సీఎస్ కలెక్టర్లను ఆదేశించారు.ఇందుకు గాను ఐకేపీ, సహకార సంఘాల ద్వారా దాదాపు 7 వేల1 49 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ధాన్యం కొనుగోలు కేెెంద్రాలు : ధాన్యం కొనుగోలు అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో ఉండగా సూర్యాపేటలో 3,69,626 కరీంనగర్‌లో 3,64,525, సిద్దిపేటలో 3,64,525 సిరిసిల్లలో 3,12,451, పెద్దపల్లిలో 3,12,450, నాగర్ కర్నూల్‌లో 2,31,400, జనగామలో 2,18,716, వనపర్తిలో 2,08,300, నిర్మల్‌లో 2,05,473, సంగారెడ్డిలో 1,96,519, మంచిర్యాలలో 1,82,044, మహబూబాబాద్‌లో 1,77,075, హనుమకొండ లో 1,67,923, వరంగల్‌లో 1,56,225, నారాయణపేటలో 1,41,238, మహబూబ్‌నగర్‌లో 1,29,746, భూపాలపల్లిలో 1,27,038, ఖమ్మంలో 1,24,980, వికారాబాద్‌లో 1,24,303, గద్వాలలో 1,04,150, ములుగులో 88,528, కొత్తగూడెంలో 67,697, రంగారెడ్డిలో 41,660, ఆసిఫాబాద్‌లో 36,510, మేడ్చల్‌లో 26,037, ఆదిలాబాద్ 655 టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ఉంది.
ఐతే ఈ లక్ష్యాన్ని పౌరసరఫరాల శాఖ చేరుకుంటుందా అనేదే ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే గత వానాకాలం సీజన్‌లోనూ ధాన్యం కొనుగోళ్లు భారీగా తగ్గాయి. వానాకాలం సీజన్‌లో ఆల్‌టైం రికార్డుస్థాయిలో వరి సాగవ్వగా దాదాపు 70లక్షల టన్నుల వరిధాన్యం కొనుగోలు చేయాల్సి వస్తుందని అంచనా వేశారు. కానీ, ఆ కొనుగోలు 50లక్షల టన్నుల లోపే పరిమితమైంది. ఇదే 2022 వానాకాలం సీజన్‌లో 64లక్షల టన్నుల వరకు ధాన్యం కొనుగోలు జరిగింది. పౌరసరఫరాల శాఖ కొనుగోళ్లు పక్కాగా చేపడతామని చెప్పినా వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉంటాయి. అమ్మకానికి కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యంలో తేమశాతం సరిగ్గా లేదని స్థానిక అధికారులు కొనుగోలు చేయరు. తరుగు కూడా ఇష్టారీతిన తీస్తుంటారు. దీంతో రైతులు అవస్థలు పడుతుంటారు.
Govt Open Paddy Procurement Centers : గతంలో ఇలాంటి పరిస్థితులు అనేకం ఉన్నాయి. దీనికితోడు మద్దతుధర అందక కూడా అన్నదాతలు ఇబ్బందులు పడుతుంటారు. దీనికి తోడు సరైన సమయా నికి ఖాతాలో డబ్బులు జమ కావు. ఇలాంటి సమస్యలు రైతుల ఓపికకు పరీక్ష పెడతాయని చెప్పుకోవచ్చు. ఇలా ఆరుగాలం శ్రమించి పండించిన పంట అమ్ముకోవడానికి రైతులు పడే బాధ అంతా ఇంతా కాదు. వరిధాన్యం దిగుమతిలో దాదాపు 40 శాతం వరకు దళారులే కొంటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. దీనిని అధిగమించి పౌర సరఫరాల శాఖ ధాన్యం కొనుగోలు చేస్తేనే 75.40కోట్ల టన్నుల ధాన్యం సేకరణ సులువు అవుతుందని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు.
Paddy Procurement Problems : యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలనే ఆలోచన పౌరసరఫరాల శాఖ అధికారులకు ఉన్నా క్షేత్రస్థాయి అధికారులు ఆ దిశగా రైతులతో వ్యవహరించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కొనుగోలు కేంద్రాలను కూడా అవసరమైన చోటున కాకుండా పంటపొలాలకు దూరంగా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో రైతులపై రవాణాఛార్జీలు పడే ప్రమాదం ఉంటుంది. దీనికి తోడు సంచుల కొరత కూడా కొనుగోలు ఆటంకం కల్గిస్తుంది. కొనుగోలు కేంద్రాల్లో కొన్న చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లుకు తరలించడానికీ వాహనాల ఏర్పాటుకూ అధికారులు సరైన చర్యలు తీసుకోరు. దీంతో ఆ భారం సైతం రైతులపై పడుతోంది.
ఇలా గత అనుభవాలు దృష్టి ఉంచుకొని సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పౌరసరఫరాల సంస్థపై ఉందని రైతులు, రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. ధాన్యం సేకరణలో లక్ష్యం నిర్దేశించుకున్న అధికారులు సాధ్యమైనంత త్వరలో రైతుల ఖాతాల్లో డబ్బులు కూడా జమ చేయాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వ కొనుగోళ్లలో ఎలాంటి సమస్యలు లేకపోతే ధాన్యం సేకరణ డబ్బు జమ త్వరగా జరిగితే రైతులు తమ ధాన్యాన్ని దళారులకు విక్రయించరని వారు చెబుతున్నారు.
Farmers Problems in Hanamkonda : వర్షాకాలం వచ్చేస్తుంది.. త్వరగా ధాన్యం కొనండయ్యా..!
Paddy Procurement Issue in TS : ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. రైతుల నరకయాతన