Jayashankar Bhupalpally Floods : జులై 27 2023 ఈ తేదీ వస్తే గుర్తుకు వస్తే చాలు ఈ గ్రామాల ప్రజలు హడలిపోతున్నారు. ఏడాది గడిచినా ఇప్పటికీ వరద విలయాన్ని మర్చిపోలేకపోతున్నారు. ఉగ్రరూపం దాల్చిన వాగులు ఊరిని ముంచెత్తిన దృశ్యాలు ఇంకా వారి కళ్లముందే మెదులుతున్నాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకు జీవుడా! అంటూ బయటపడిన ఆ ఆపత్కాలాన్ని తల్చుకుని తల్లడిల్లిపోతున్నారు.
సరిగ్గా ఏడాద్రి క్రితం భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిని మోరంచ వాగు ముంచెత్తింది. పొలాలతో పచ్చగా ఉండే ఈ గ్రామం నామరూపాల్లేకుండా మారిపోయింది. గ్రామస్థులు ఇంటి పైకెక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. హెలికాఫ్టర్ సాయంతో పలువురు ప్రాణాలు దక్కించుకున్నారు. అధికార యంత్రాంగం, సింగరేణి రెస్కూ బృందాలు బోట్ల సాయంతో గ్రామస్థులను రక్షించారు. కొందరు గ్రామస్థులే ధైర్యం చేసి ఇరుగు పొరుగు వారి ప్రాణాలు కాపాడారు.
గతేడాది ఘటన గుర్తుకు తెచ్చుకుని : వరదల ధాటికి గ్రామంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వరదలో కొట్టుకుపోయిన ముగ్గురు మృతదేహాలు దొరికినా మహాలక్ష్మి అనే మహిళ, మరో యాచకుడి మృతదేహాలు మాత్రం లభ్యం కాలేదు. వరదలు సృష్టించిన బీభత్సం పూర్తయి సంవత్సరం అయినా ఇంకా గ్రామస్థులు ఈ చేదు జ్ఞాపకాలను మరిచిపోలేకపోతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో నాలుగు రోజుల క్రితం మళ్లీ వాగు ఉద్ధృతి పెరగడంతో ప్రస్తుతం నిద్ర కూడా పోకుండా బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. ఇప్పటికైనా ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
రాష్ట్రాన్ని ముంచెత్తిన వర్షాలు - వరదనీటిలో మునిగిన పంటలు - Rains Effects In Telangana
8 మంది జలసమాధి : ములుగు జిల్లా కొండాయ్ గ్రామస్థులూ నాటి వరదలు మిగిల్చిన విషాదం నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నారు. ముంపు చేసిన గాయం నుంచి కోలుకోలేపోతున్నారు. సరిగ్గా ఇదే రోజున జంపన్న వాగు ఉప్పొంగి కొండాయ్ గ్రామాన్ని ముంచేసింది. ఉన్నట్లుండి వచ్చిన వరదలతో గ్రామస్థులు తలోదిక్కు పరుగులు పెట్టారు. ప్రాణాలు అరచేత్తో పట్టుకుని వెళ్లే క్రమంలో 8 మంది జలసమాధి అయ్యారు. చాలా మంది ఇళ్ల పైకెక్కి సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు.
"నరకం అనుభవించినం. దాన్ని తలుచుకుంటేనే ఏడుపు వస్తుంది. మొన్న కురిసిన వర్షాలకు కూడా చాలా భయపడ్డాం. వరద నీరు పీకల వరకు రావడం వల్ల చాలా మందికి ఆరోగ్యం చెడిపోయింది. వర్షం పడినప్పుడు మాకు భయమేస్తుంది. అసలు ఆ చెరువు నీటిని చూస్తేనే ఏడుపు వస్తుంది. వాగు మళ్లీ వచ్చింది. ఆరోజు కూడా తెల్లారేవరకు ఎవరూ నిద్రపోలే. జీవితాంతం మరిచిపోలేని సంఘటన. మళ్లీ వరదలు వస్తే మా పరిస్థితి ఏంది అన్నట్లుగానే ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి శాశ్వత పరిష్కారం చూపించాలి." - స్థానికులు
కొండాయ్ గ్రామం పూర్తిగా దెబ్బతినగా పక్కనే ఉన్న మాల్యాల, దొడ్ల గ్రామాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇప్పటికీ పూర్తికాని వంతెన వరద బీభత్సానికి సాక్ష్యంగా నిలుస్తోంది. ఇప్పుడు వర్షాలు పడడం, వాగులు పొంగడంతో మళ్లీ ఏం జరుగుతుందో వీరంతా ఆందోళన చెందుతున్నారు. తాత్కాలిక సాయం అందించారు తప్ప గ్రామాలను పూర్తిగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్న విజ్ఞప్తి ఏడాదైనా ఆచరణలోకి రాలేదు.
హైదరాబాద్లో పలుచోట్ల వర్షాలు - ఇబ్బందులు పడుతున్న వాహనదారులు - hyderabad rains
చెట్టెక్కితేనే ఆ గూడేనికి చేరిక - ఏళ్ల తరబడి గిరిజనుల సాహసం - Tribes Suffering With Floods