IPL 2025 Telugu Cricketers : ఐపీఎల్ మెగా వేలం ముగిసింది. ఆటగాళ్ల నైపుణ్యాల ఆధారంగా ఫ్రాంఛైజీలు వారిపై కనక వర్షం కురిపించారు. అలా పెద్దగా పేరు లేని కొంతమంది యంగ్ ప్లేయర్స్ వేలంలో అనూహ్యమైన ధర దక్కించుకుని క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచారు. అలానే కోటీశ్వరులుగానూ మారారు. అయితే ఈ ఐపీఎల్ మెగా వేలంలో కొత్తగా ముగ్గురు తెలుగు కుర్రాళ్లకు కూడా అవకాశం దక్కింది.
IPL 2025 Satyanarayana Raju - కాకినాడకు చెందిన ఫాస్ట్ బౌలర్ సత్యనారాయణ రాజు రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలం బరిలోకి దిగాడు. అతడి కనీస ధరకే ముంబయి ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఈ ఏడాదే సత్యనారాయణ రంజీల్లో ఎంట్రీ ఇచ్చాడు. గత ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ మంచి ప్రదర్శన చేశాడు. విజయ హజారే వన్డే ట్రోఫీలోనూ మెరిశాడు. దీంతో ముంబయి అతడిని వేలంలో సొంతం చేసుకుంది. ముంబయి జట్టులో తెలుగు తేజం తిలక్ వర్మ కూడా ఉన్నాడు. ఈ హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మను ముంబయి జట్టు రూ.8 కోట్లకు రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే.
IPL 2025 Tripurana Vijay - శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన త్రిపురణ విజయ్ను దిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. అతడు దేశవాళీల్లో నిలకడగా రాణించి ఈ అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈ ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్‌ను దిల్లీ జట్టు రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. విజయ్, 7 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 16 వికెట్లు తీసి, 150 పరుగులు సాధించాడు. రంజీ, కూచ్‌బెహర్ ట్రోఫీల్లోనూ రాణించాడు. ప్రస్తుతం ముస్తాక్ అలీ టోర్నీలోనూ మంచిగా రాణిస్తున్నాడు.
IPL 2025 Pyla Avinash - విశాఖపట్నం అనకాపల్లి జిల్లా దోసూరు అనే చిన్న గ్రామానికి చెందిన క్రికెటర్ పైలా అవినాశ్. అతడు ఈ సారి ఐపీఎల్ అవకాశాన్ని అందుకున్నాడు. రూ.30 లక్షల కనీస ధరతో పంజాబ్ కింగ్స్ అతడిని దక్కించుకుంది. అవినాష్ తండ్రి సత్యారావు ఓ ఎలక్ట్రీషియన్. అయితే అవినాశ్ క్లబ్ క్రికెట్‌తో పాటు;ఈనాడు; క్రికెట్ టోర్నీలోనూ మంచి ప్రదర్శన చేశాడు. అనంతరం ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లోనూ మంచిగా ఆడాడు. ఆ టోర్నీలోని ఓ మ్యాచ్‌లో 58 బంతుల్లోనే 105 పరుగులు చేశాడు. హిట్టర్‌గా పేరు సంపాదించాడు. దీంతో పంజాబ్ కింగ్ అతడిని దక్కించుకుంది.
IPL 2025 Shaik Rasheed - గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ గురించి చాలా మంది క్రికెట్ ప్రియులకు తెలిసే ఉంటుంది. 2022 అండర్-19 వరల్డ్ కప్‌లో భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. సెమీస్, ఫైనల్‌లో మంచిగా రాణించి జట్టు కప్పును ముద్దాడడంలో కీలకంగా వ్యవహరించాడు. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తూ ముందుకెళ్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ గత ఏడాది అతడిని కొనుగోలు చేసింది. అయితే అతడికి తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. కానీ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా స్టన్నింగ్ క్యాచ్ అందుకుని ఆకట్టుకున్నాడు. కానీ ఈ సారి మెగా వేలం ముంగిట రషీద్‌ను విడిచిపెట్టింది సీఎస్కే. కానీ మళ్లీ వేలంలో అతడిని రూ.30 లక్షలకు దక్కించుకుంది. మరి ఈ కుర్రాళ్లకు ఈ ఐపీఎల్ సీజన్లో మ్యాచ్‌లు ఆడే అవకాశం వస్తుందో లేదో, ఒకవేళ వస్తే ఎలా ఆడతారో చూడాలి.
మొత్తంగా టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్, హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌తో సహా తెలుగు కుర్రాళ్లు ఐదుగురు మెగా వేలంలో అమ్ముడుపోయారు. సిరాజ్‌ను గుజరాత్ టైటాన్స్ రూ.12.25 కోట్లు పెట్టి దక్కించుకుంది. ఇక తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిని సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.6 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇతడు బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో ఆడుతున్నాడు.
ఇకపోతే ఆంధ్ర ప్లేయర్లు కేఎస్ భరత్, బైలపూడి యశ్వంత్, సిరిసిల్ల కుర్రాడు ఆరవెల్లి అవనీశ్‌కు నిరాశ ఎదురైంది. ఏ ఫ్రాంఛైజీ కూడా వీరిని తీసుకోలేదు.
13 ఏళ్ల వైభవ్ ఐపీఎల్ ఆడొచ్చా? - రూల్స్ ఏం చెబుతున్నాయంటే?
వేలంలో కావ్య మారన్ మార్క్ సెలెక్షన్ - పవర్‌ఫుల్‌గా సన్‌రైజర్స్ టీమ్