Attack on Manchu Manoj : మంచు ఫ్యామిలీలో ఉద్రిక్తతలు మరింత వేడెక్కాయి. ఉదయం నుంచి మంచు మోహన్ బాబు, ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ మధ్య జరిగిన చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో సాయంత్రం భార్యతో కలిసి అడిషనల్ డీజీపీని కలిసిన మనోజ్ కాసేపటి క్రితం తిరిగి జల్‌పల్లి చేరుకున్నాడు. లోనికి వెళ్లిన మంచు మనోజ్‌పై దాడి జరిగినట్లు తెలుస్తోంది. చిరిగిన చొక్కాతో మంచు మనోజ్ బయటకు రావడం కనిపించింది.
ముందుగా మనోజ్ దంపతులను అక్కడున్న భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. గేట్లు తీయాలంటూ సెక్యూరిటీ సిబ్బందిపై మనోజ్ మండిపడ్డారు. తమ కుమార్తె లోపల ఉందని లోనికి వెళ్లాలని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎంత సేపటికి గేట్లు తీయకపోవడంతో నెట్టుకొని లోపలికి వెళ్లాడు. కాసేపటి తరువాత మంచు మనోజ్ చిరిగిన చొక్కాతో బయటకు రావడం కనిపించింది. ఈ సమయంలో లోనికి వచ్చిన మీడియా ప్రతినిధులపై మోహన్‌బాబు ఆగ్రహంతో ఊగిపోయారు. వారిపై చేయిచేసుకున్నారు. బౌన్సర్ల దాడిలో ఓ కెమెరామెన్ కిందపడిపోయారు. మీడియా ప్రతినిధులను బయటకు నెట్టి బౌన్సర్లు గేటుకు తాళం వేశారు.
జర్నలిస్టుల ఆందోళన : మోహన్ బాబు ఇంటి వద్ద ఆందోళనతో పోలీసులు అప్రమత్తమ్యయారు. అదనపు బలగాలను అక్కడకు పంపారు. మరోవైపు తమపై మోహన్ బాబు దాడికి నిరసనగా జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. తమకు మోహన్ బాబు క్షమాపణ చెప్పాలని వారు ధర్నా చేపట్టారు. ఈ ఘటన తరువాత మోహన్ బాబు తన పెద్ద కుమారుడు విష్ణుతో కలిసి కాంటినెంటల్ ఆసుపత్రిలో వెళ్లారు. ఆయన అస్వస్థతకు గురైనందున వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. జల్‌పల్లిలో జరిగిన ఘటనను రాచకొండ కమిషనర్ సీరియస్‌గా తీసుకున్నారు. రేపు ఉదయం 10.30కు తమ కార్యాలయానికి రావాలని మోహన్‌బాబు, మనోజ్, విష్ణుకి రాచకొండ సీపీ నోటీసులు జారీచేశారు.
అంతకు ముందు అడిషనల్ డీజీపీని కలవడానికి ముందు పోలీసులతో ఫోన్‌లో మంచు మనోజ్ భార్య మౌనిక వాగ్వాదానికి దిగిన వీడియో వైరల్‌గా మారింది. తన పిల్లలు, కుటుంబసభ్యుల జోలికొస్తే ప్రైవేట్ కేసు వేస్తానని వీడియోలో మౌనిక హెచ్చరించారు. తమకు రక్షణగా ఉన్న బౌన్సర్లను పోలీసులు బయటకు పంపించారని, మనోజ్ సెక్యూరిటీని తీసేస్తున్నారని ఆమె ఫోన్‌లో పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. తమ బౌన్సర్లను ఎలా బయటకు పంపుతారని మౌనిక వాగ్వాదానికి దిగారు. దాడిలో మంచు మనోజ్‌కు గాయాలయ్యాయని, పోలీసులు న్యాయంగా వ్యవహరించాలని భూమా మౌనిక పోలీసులను డిమాండ్ చేశారు.
మంచు ఫ్యామిలీలో తారాస్థాయికి చేరిన వివాాదాలు - ప్రాణహాని ఉందని అదనపు డీజీపీకి మనోజ్ దంపతుల ఫిర్యాదు