Illegal Constructions In Hyderabad : హైదరాబాద్‌లో నిబంధనలను ఉల్లంఘించి 40, 50గజాల స్థలాల్లోనే ఆరు, ఏడు అంతస్తులు నిర్మిస్తున్నారు. దీంతో కొన్ని నిర్మాణాలు కూలుతుండగా, మరికొన్ని నిర్మాణం పూర్తయ్యాక నేలమట్టం అవుతున్నాయి. అయితే గ్రేటర్‌లో జీహెచ్‌ఎంసీ ప్రణాళిక విభాగం, శివారు ప్రాంతాల్లో సంబంధిత పురపాలక సంస్థలు, గ్రామ పంచాయతీల్లోని కొందరు అధికారులు అక్రమ నిర్మాణాలను లంచాలకు ఆశపడి చూస్తూ ఉంటున్నారు. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలు కూడా వీటిని పట్టించుకోవట్లేదు.
నిబంధనలు పాటించట్లేదు : 100, 120 గజాల్లోపు స్థలాల్లో నిర్మించే ఇళ్లకు సెట్‌బ్యాక్ నిబంధన ఉండదు. జీ+1, జీ+2 అంతస్తులకే పరిమితమవ్వాలి. కాని 120 గజాల్లోపు స్థలాల్లో 90శాతం నిబంధనలను ఉల్లంఘించే కట్టారు. ఫిల్మ్‌నగర్, గోషామహల్, పాతబస్తీ, కోఠి, అబిడ్స్, గచ్చిబౌలి సిద్ధిఖ్‌నగర్, చింతలబస్తీల్లో 40, 50 గజాల స్థలాల్లో ఆరు, ఏడు అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు.
స్థలం విస్తీర్ణం 150 గజాలకు మించితే పార్కింగ్ కోసం చుట్టూ ఉండే నిర్మాణాల అంచు వరకు జేసీబీతో తవ్వుతున్నారు. దీంతో పక్కనున్న భవనాల పునాదులు కదులుతున్నాయి. తాజాగా గచ్చిబౌలి సిద్ధిఖ్‌నగర్‌లో ప్రమాదం ఇలాంటిదే. ప్రమాదానికి గురైన భవనానికేగాక చుట్టూ ఉన్న 95శాతం నిర్మాణాలకు అనుమతి లేదు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో 200గజాల నుంచి వెయ్యి గజాల విస్తీర్ణంలో అపార్ట్‌మెంట్ల నిర్మాణం జరుగుతోంది. ప్రతిదీ ఏడంతస్తులే. కొంత మంది అవినీతి అధికారులు ఒక్కో అంతస్తుకు రూ.5 నుంచి 10లక్షలు తీసుకుని అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారు.
తనిఖీలు వసూళ్లకే : అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు జోనల్ కమిషనర్ల ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ బృందాలు ఉంటాయి. బస్తీలు, కాలనీల్లో పర్యటిస్తూ అలాంటి నిర్మాణాలు కనిపిస్తే జోనల్ కమిషనర్‌కు తెలియజేయాలి. ఆ తర్వాత వాటిపై చర్యలు తీసుకోవాలి. కానీ ఈ బృందాల్లోని కొందరు న్యాక్ ఇంజినీర్లు వసూళ్లకు పాల్పడి అక్రమ నిర్మాణాలకు నోటీసులు ఇస్తున్నారు.
ఫిర్యాదు చేసేవారి సమాచారం బహిర్గతం : కూకట్‌పల్లి సర్కిల్ మూసాపేట పరిధిలో ఓ వ్యక్తి తమ కాలనీలో కడుతున్న అక్రమ నిర్మాణాల వివరాలను జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయానికి పంపించారు. అక్కడి నుంచి కూకట్‌పల్లి అధికారులకు వివరాలు పంపి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు తెలిపారు. వారు ఆ నిర్మాణ పనులను నిలిపివేశారు. ఒక నెల గడిచిన తర్వాత నిర్మాణ పనులు యధావిధిగా కొనసాగుతున్నాయి. ఆరాతీస్తే కొందరు అధికారులు నిర్మాణదారుల నుంచి డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలొచ్చాయి. ఫిర్యాదు చేసిన వ్యక్తి వివరాలను బిల్డర్లకు ఇచ్చారు. వారంతా ఫిర్యాదు చేసిన వ్యక్తి ఇంటికి వెళ్లి బెదిరించారు.
పేక మేడల్లా కూలుతున్న భవనాలు - ఆ తప్పిదాలే ప్రమాదాలకు కారణమా?