NDSA Questions To Barrage Contractors : బ్యారేజీలు ప్రమాదంలో ఉన్నట్లు, దాని కారణంగా నష్టం వాటిల్లినట్లు ఎప్పుడు గుర్తించారు, వెంటనే ఎలాంటి కార్యాచరణకు సిద్ధమవుతున్నారు, సమగ్రంగా మొదటి నుంచీ క్రమపద్ధతిలో పూర్తిగా వివరాలను అందజేయాలని గుత్తేదారులను జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ (NDSA) నిపుణుల కమిటీ కోరింది. ఈ మేరకు మేడిగడ్డ(Medigadda), అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిర్మించిన గుత్తేదారు సంస్థలు ఎల్ అండ్ టీ(L&T), అప్కాన్స్, నవయుగ కంపెనీలకు చంద్రశేఖర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ వివరాల కోసం లేఖలు రాసింది.
బ్యారేజీల వారీగా ఆయా గుత్తేదారులు పూర్తి వివరాలతో సమగ్రంగా నోట్ ఇవ్వాలంటూ సుమారు 35 ప్రశ్నలను సంధించింది. బ్యారేజీలను ప్రారంభించిన తర్వాత మొదటి వర్షాకాలం సమయంలో వాటికి నష్టం వాటిల్లే అవకాశం గురించి సంకేతాలు అందిన దానికి తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల క్రమంగా తీవ్రత పెరిగి స్ట్రక్చర్‌కు నష్టం వాటిల్లిందా అనే అంశంపై కూడా సవివరంగా రిపోర్ట్ ఇవ్వాలని కోరింది.
NDSA Detailed Interaction With Contractors : పని పూర్తి చేసిన తర్వాత బ్యారేజీ అపరేషన్స్ అండ్ మెయింటనెన్స్‌తో గుత్తేదారుకు సంబంధం ఉందా, ఉంటే ఒప్పందం ప్రకారం నిర్వహణ బాధ్యత ఎన్ని సంవత్సరాలంటూ దానికి సంబంధించిన ఒప్పంద పత్రాన్ని కూడా అందజేయాలని కోరింది. ప్రాజెక్టులోని ప్రతి పని, బ్లాకులవారీగా నిర్మాణ షెడ్యూల్, నిర్మాణ సమయంలో సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో)(Central Design Organisation) ఇచ్చిన డ్రాయింగ్‌కు భిన్నంగా ఎన్నిసార్లు మార్పులు చేయాల్సి వచ్చింది దాని వివరాలు కూడా తెలపాలని కోరింది.
సీడీవో షీట్‌పైల్‌కు సిఫార్సు చేసినా కటాఫ్‌కు సీకెంట్ పైల్‌ను ఎందుకు నిర్ణయించాల్సి వచ్చింది, సీకెంట్ పైల్ కటాఫ్ నిర్మాణ మెథడాలజీ ఏంటని ప్రశ్నించింది. నిర్మాణ సమయంలో పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన యంత్రాంగం సంబంధించిన వివరాలను, పరిశీలించి అధ్యయనం చేసిన అంశాలను ఇవ్వాలని ర్యాఫ్ట్, కటాఫ్, కనెక్షన్ జాయింట్ నిర్మించిన వరుస క్రమం, ప్రతిపనీ పూర్తిచేసిన వివరాలను వెల్లడించాలని కోరింది. సంబంధిత ఇంజినీర్ ఆమోదించిన నాణ్యత ధ్రువీకరణ డాక్యుమెంట్, నిర్మాణ సంస్థ అంతర్గత క్వాలిటీ కంట్రోల్ విభాగం పరిశీలనలో వెల్లడైన అంశాలను ఇవ్వాలని సూచించింది.
మేడిగడ్డ బ్యారేజీ విషయంలో ఎన్‌డీఎస్‌ఏ నిపుణుల కమిటీ మరిన్ని వివరాలను కోరినట్లు సమాచారం. నిర్మాణ సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలు, బ్యారేజీకి నష్టం జరిగినట్లు గుర్తించినప్పటి నుంచి ప్రాజెక్టు ఇంజినీర్లతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలను ఇవ్వాలని కోరింది. బ్యారేజీ దిగువన ప్లింత్ స్లాబ్, సీసీ బ్లాకులు, టో వాల్, లాంచింగ్ ఆఫ్రాన్ మొదలైనవి దెబ్బతినడానికి, పక్కకు జరగడానికి కారణాలేమిటి బ్యారేజీలు ప్రారంభించిన వెంటనే జరగడానికి కారణాలు ఏంటని ప్రశ్నించింది. వచ్చే వర్షాకాలంలో వరద రాకముందే బ్యారేజీల రక్షణకు ఎలాంటి చర్యలు అవసరం అనుకుంటున్నారు, దీర్ఘకాలంలో తీసుకోవాల్సిన చర్యలు ఏంటి ఇలా అనేక అంశాలపై గుత్తేదారుల నుంచి అభిప్రాయం అడిగింది. గేట్ల నిర్వహణ సహా పలు అంశాలపై ప్రశ్నలు సంధించింది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై మరింత లోతుగా అధ్యయనం చేయాలన్న కేంద్ర కమిటీ - DG Rajiv Ratan on Medigadda