NDSA Committee on Barrage Designs : మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల డిజైన్లకు సంబంధించిన సమగ్ర వివరాలను ఇంజినీర్ల నుంచి చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ తీసుకొంది. ఎర్రమంజిల్ జలసౌధలో రెండో రోజు భేటీలో భాగంగా సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (CDO)ఇంజినీర్లతో సమావేశమైంది. సీడీఓ ఇంజినీర్లతో డిజైన్లకు సంబంధించిన వివరాలు ఆరా తీశారు. ఆనకట్టల డిజైన్ల రూపకల్పన, పరిజ్ఞానం, సాంకేతిక అంశాలపై ప్రశ్నించారు.
డిజైన్లు ఆనకట్టను దృష్టిలో పెట్టుకొని చేశారా, లేక డ్యాం కోసం చేశారా అని ఇంజినీర్లను అడిగారు. నీటి నిల్వ సామర్థ్యం, అందుకోసం అవలంభించిన విధానాలు, డిజైన్లలో ఎక్కడైనా మార్పులు చేయాల్సి వస్తే ఎవరు చేశారు? ఎవరి అనుమతి తీసుకొన్నారు? తదితర అంశాల గురించి కమిటీ ఆరా తీసింది. ఆనకట్టల నిర్మాణం, నిర్వహణను పర్యవేక్షించిన ఇంజినీర్లతోనూ విడివిడిగా సమావేశమైన కమిటీ, సంబంధిత వివరాలు తీసుకొంది.
Kaleshwaram Project Investigation : మూడు ఆనకట్టల నిర్మాణ సంస్థల ప్రతినిధులతోనూ చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ సమావేశమైంది. అన్ని అంశాలపై వారి నుంచి సమాచారాన్ని రాబట్టింది. డిజైన్లు, నిర్మాణం, నాణ్యతలో పాత్ర, మార్పులు - చేర్పుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌లో భాగంగా చేపట్టిన తనిఖీలు, పనులకు సంబంధించిన పూర్తి వివరాలు తీసుకున్నారు. సమావేశం సందర్భంగా కొంత మంది ఇంజినీర్లపై కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారని, తప్పించుకంటున్నారని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సీబీఐ, ఈడీ తరహాలో కమిటీ సభ్యులు తమను ప్రశ్నిస్తున్నారని ఇంజినీర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
NDSA Committee : ఈ నిపుణుల కమిటీకి కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వం(NDSA CHANDRASHEKAR IYER) వహిస్తున్నారు. కమిటీలో మరో ఐదుగురు సభ్యులుగా ఉన్నారు. సెంట్రల్ సాయిల్ అండ్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త యూసీ విద్యార్థి, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త ఆర్ పాటిల్, కేంద్ర జల సంఘం డైరెక్టర్లు శివ కుమార్ శర్మ, రాహుల్ కుమార్ సింగ్, ఎన్డీఎస్ఏ టెక్నికల్ డైరెక్టర్ అమితాబ్ మీనా కమిటీ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.
నాలుగు నెలల్లోపు నివేదిక : కాళేశ్వరం(Kaleshwaram Project) ఆనకట్టల పునరుద్ధరణపై చేపట్టాల్సిన కార్యాచరణ, తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేయాలని నిపుణుల కమిటీని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. భవిష్యత్‌లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలను కూడా కమిటీ సూచించాలని తెలిపింది. మూడు ఆనకట్టల డిజైన్లకు సంబంధించిన ఫిజికల్, మేథమెటికల్ మోడల్ స్టడీస్(Mathematical Model Study)ను పరిశీలించాలని పేర్కొంది. నిపుణుల కమిటీ నాలుగు నెలలలోపు నివేదిక సమర్పించాలని ఎన్డీఎస్ఏ గడువు నిర్దేశించింది.
బ్యారేజీల నిర్మాణ స్థలాన్ని మార్చాల్సిన అవసరం ఏముంది? - అధికారులపై ఎన్డీఎస్ఏ కమిటీ ప్రశ్నల వర్షం
రాష్ట్రానికి పెనుభారంగా మారనున్న కాళేశ్వం ప్రాజెక్ట్ - కాగ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు