Allu Arjun Remanded : సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట, ఒకరి మృతి కేసులో నాంపల్లి కోర్టు పుష్ప హీరో అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 27 వరకు రిమాండ్ విధిస్తున్నట్లు నాంపల్లి 9వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు అల్లు అర్జున్ను చంచలగూడ జైలుకు తరలించారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఇవాళ మధ్యాహ్నం అల్లు అర్జున్ను ఆయన నివాసంలో చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. ఇరుపక్షాల వాదనల అనంతరం కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. అల్లు అర్జున్ను చంచల్‌గూడకు తీసుకురావడంతో జైలు వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. సౌత్ ఈస్ట్ జోన్ ఏసీపీ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. జైలు వద్దకు అల్లు అర్జున్ అభిమానులు భారీగా తరలి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
కాసేపటికి హైకోర్టు అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ఆదేశాలు వెలువడ్డాయి. ఉదయం ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌పై సుదీర్ఘ వాదనల అనంతరం న్యాయమూర్తి అల్లు అర్జున్‌కు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్లు ప్రకటించారు. కోర్టు నుంచి బెయిల్ పేపర్లు సిద్ధం కాగానే వాటిని చంచల్ గూడ జైలు అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. ఆ తరువాత బన్నీ బయటకు రానున్నారు.