Nalgonda Sadhya Got State First Rank in TG PECET 2024 : బంతితో కుస్తీ పడుతున్న ఈ యువతి పేరు చిట్టిమల్ల సంధ్య. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం అమ్మనబోలు గ్రామానికి చెందిన చిట్టిమల్ల రమేశ్-మాధవీ దంపతులు చిన్న కుమార్తె. వీరిది వ్యవసాయ కుటుంబం. అమ్మనబోలు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో చదువుకుంది. పాఠశాల స్థాయి నుంచే చదువులో క్రీడల్లో రాణిస్తోంది సంధ్య.
పాఠశాలలో స్నేహితులు ఆడుతుంటే చూసి క్రీడలపై ఆసక్తి పెంచుకుంది. తన ఆసక్తి చూసి ఉపాధ్యాయులూ ప్రోత్సహించారు. దాంతో సౌకర్యాలు లేకున్నా పట్టుదలతో సాధన చేసిన సంధ్య అండర్ 14, 19 బాలికల విభాగాల్లో పాల్గొని పలు ప్రశంసాపత్రాలు సాధించింది. రాష్ట్ర స్థాయిలో ఫుట్‌బాల్ పోటీల్లో మెప్పించింది. అదే ప్రతిభతో జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీల్లోనూ మెరుగైన ప్రదర్శనతో రాణించింది ఈ క్రీడాకారిణి.
ఆటలతో పాటు చదువు : క్రీడల్లో రాణిస్తూ చదువును నిర్లక్ష్యం చేయలేదు సంధ్య. అధ్యాపకులు, స్నేహితుల సహకారంతో ప్రతిభను మెరుగుపరుచుకుంది. ఆ సమయంలోనే వ్యాయామ ఉపాధ్యాయుడు మధుసూదన్ ప్రోత్సాహంతో టీజీ పీఈసెట్‌కు పరీక్షకు దరఖాస్తు చేసుకుంది. ఇటీవల విడుదలైన ఆ పోటీ పరీక్షల ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సాధించింది సంధ్య. గురువు ప్రోత్సాహంతో కబడ్డీ, ఫుట్‌బాల్ క్రీడల్లో రాణించి అనేక పతకాలు సాధించింది సంధ్య. ఉదయం, సాయంత్రం ఆటల కోసం సాధన కళాశాల వేళల్లో చదువుపై దృష్టి పెట్టింది.
ఇలా రెండు అంశాలపై శ్రద్ధతో సాధన చేయడం వల్లేస్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధ్యమైందని అంటోంది ఈ అమ్మాయి. ఇందులో రెండేళ్లు కోర్సు పూర్తి చేసి వ్యాయామ ఉపాధ్యాయురాలిని అవుతానని అలా చేస్తూ కూడా క్రీడల్లో రాణిస్తానని చెబుతోంది. సంధ్య చిన్నప్పటి నుంచి చదువు ఆటలు అన్నింట్లో ముందు ఉండేదని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శైలజ రాణి చెబుతున్నారు. టీజీ పీఈసెట‌్‌లో రాష్ట్ర మొదటి ర్యాంకు సాధించడం అభినందనీయమన్నారు.
"నేను కానిస్టేబుల్ కావాలని అనుకున్నాను. ఇంతకు మించినవి ఏమీ ఉన్నాయని కాలేజీలో సార్లను అడిగితే పీఈసెట్ గురించి చెప్పారు. ఒక వైపు ప్రాక్టీస్ చేస్తూనే చదువుకునేదాన్ని. పదోతరగతి వరకు ప్రభుత్వం పాఠశాలలోనే చదువుకున్నాను. మాది వ్యవసాయ కుటుంబం. పీఈసెట‌్‌లో నాకు మొదటి ర్యాంకు వచ్చింది. ఎంతో సంతోషంగా ఉంది. ఇటు ఆటలపైన దృష్టి పెడుతూనే పోలీస్‌ను అవుతా." - చిట్టిమల్ల సంధ్య, క్రీడాకారిణి
ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న సంధ్యను చదివిస్తున్నామని ఆమె ఆటలకు ప్రోత్సహం అందిస్తున్నామని తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రభుత్వం సాయం అందిస్తే ఇంకా మంచి క్రీడాకారిణి అవుతుందని విజ్ఞప్తి చేస్తున్నారు. నిరుపేద కుటుంబంలో ఎన్నో కష్టాలు అనుభవించింది సంధ్య. ఆ కష్టాల నుంచి సాధించాలి అనే పట్టుదల పెరిగిందని చెబుతోంది. అందుకే చిన్ననాడే లక్ష్యం నిర్దేశించుకుని సాధన చేశానని అంటోంది. ఆటల్లో రాణించి అంతర్జాతీయ పతకాలు సాధించాలని ఆకాంక్షిస్తుంది. ఎప్పటికైనా పోలీసు అధికారి అవుతానంటో ధీమా వ్యక్తం చేస్తోంది ఈ క్రీడాకారిణి.
YUVA: పరిశోధనల్లో యువ వైద్యురాలి ప్రతిభ - 10 పేటెంట్ హక్కులు పొందిన డాక్టర్ - Young Doctor Uma Devi