Nag Panchami Special Story on NagulPeta Village : దేశ సంస్కృతిలో నాగదేవత పూజకు గొప్ప విశిష్టత ఉంది. ఏటా శ్రావణమాసం శుద్ధ పంచమి రోజున నాగులపంచమిని జరుపుకుంటారు. నిత్యం పూజించే నారాయణుడి శేషశయునుడి పర్వమే ఈ నాగ పంచమి. ఐతే నాగుల పంచమికి జగిత్యాల జిల్లా నాగులపేటకి ఓ ప్రత్యేకత ఉంది. నాగపంచమివచ్చిందంటే అక్కడ వెలసిన నాగమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుది. కోరినా కోర్కెలు తీర్చే చల్లని తల్లిగా నిత్యం భక్తుల కొంగుబంగారం నాగదేవత.
ఎన్నో ఏళ్ల క్రితం గ్రామంలో రైతులు పొలాలు వేసేందుకు భూమిని చదునుచేస్తుండగా, నాగ ప్రతిమలు బయటపడ్డాయి. అప్పటి నుంచి గ్రామస్తులు వాటికి విశేష పూజలు నిర్వహించడం మొదలుపెట్టారు. నాగుల చవితి మాదిరిగానే నాగపంచమి రోజు నాగ దేవతను పూజించి, పుట్టలో పాలుపోస్తారు. సర్పపూజతో సంతాన ప్రాప్తి, రాహు-కేతు దోషాలు తొలగిపోతాయని గ్రామస్తులు చెబుతున్నారు.
గ్రామంలో అందరి పేర్లు 'నా' అక్షరంతోనే మొదలు : నాగులపేటలో వెలిసిన నాగదేవతను దర్శించుకునేందుకు ఏటా భారీగా భక్తులు తరలి వస్తుంటారు. ఉద్యోగం, ఉపాధి, సంతానం, కల్యాణ సమస్యలు తొలగిపోవాలని భక్తులు పూజలు నిర్వహిస్తుంటారు. ఈ గ్రామంలో పుట్టిన పిల్లలకు 'నా' అనే అక్షరం వచ్చేటట్లు నామకరణం చేస్తుంటారు. ఏ ఇంట చూసిన నా అక్షరంతోనే మొదలైన పేర్లే ఉంటాయని గ్రామస్తులు చెబుతున్నారు.
ప్రతి సోమవారం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించాక ఆలయ ఆవరణలో అన్నదానం కార్యక్రమం ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు చెబుతున్నారు. ఈ పవిత్రమైన రోజున నాగ దేవతలకు పాయసం, పాలు నైవేద్యంగా సమర్పిస్తామని తెలిపారు. రోజంతా ఉపవాస దీక్షను పాటిస్తామని వెల్లడించారు. ఇవాళ నాగదేవతకు పాలు సమర్పించడం ద్వారా అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని, తద్వారా రక్షణ కల్పిస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు.
"నాగులమ్మ గుడి దగ్గర ప్రతి సోమవారం పూజలు జరుగుతాయి. మేమంతా ఇక్కడ నాగమ్మను బాగా కొలుస్తాము. నాగులపేట గ్రామంలో సంతానం లేని మహిళలు ఎక్కువగా వచ్చి పూజలు నిర్వహిస్తుంటారు. మా కోరికలను తీర్చే కల్పవల్లి మా ఊరి నాగమ్మ. నాగుల పంచమి రోజైతే పుట్టలో పాలు పోసి, ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తాం. అదేవిధంగా మా ఊరిలో చాలా వరకు నా అక్షరంతో పేర్లను కూడా పెట్టుకోవడం జరుగుతుంది."-భక్తులు
జాతకంలో నాగ దోషాలా? శుక్రవారం ఈ పూజ చేస్తే అంతా సెట్! - Nag Panchami 2024
Scorpion Festival Video : అక్కడ ప్రతి రాయి కింద తేలు.. ముట్టినా కుట్టదు.. ఎందుకో తెలుసా..?