Musi Project Budget Telangana 2024 : తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. మూడోరోజైన నేటి సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. శాసనసభలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మండలిలో మంత్రి శ్రీధర్ బాబు 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.2.75 లక్షల కోట్ల పద్దును ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్(Telangana Budget 2024)లో శాఖల వారీగా కేటాయింపులు జరిపిన ప్రభుత్వం మూసీ ప్రాజెక్టుకు రూ.1,000 కోట్లు కేటాయించింది. మూసీ పరివాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పన జోన్‌గా మార్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు(Musi Project Budget 2024) ద్వారా మూసీ ప్రక్షాళన చేస్తామని వివరించారు.
మూసీ అంటే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి నుంచి దాన్ని పునర్జీవింపచేయడానికి వడివడిగా అడుగులు వేస్తున్నాం. మూసీ రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేసేందుకు నూతన విధానాలను రూపొందిస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి, ఇతర అధికారులు ఇటీవల లండర్ పర్యటనలో థేమ్స్ నది నిర్వహణ తీరును పరిశీలించారు. ఏ మాత్రం కాలుష్యం లేకుండా థేమ్స్ నది లండన్ నగరం మధ్య నుంచి ప్రవహిస్తున్న తరహాలోనే మూసీ రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ మేరకు ఇటీవల హైదరాబాద్ వచ్చిన బ్రిటీష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ , నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బెర్రిలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. - భట్టి విక్రమార్క, ఆర్థిక శాఖ మంత్రి
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ద్వారా ఈ కార్యక్రమం చేపడాతమని భట్టి విక్రమార్క(Bhatti Vikramarka Budget Speech 2024) తెలిపారు. ఇందులో భాగంగా పాదచారుల జోన్లు, పీపుల్స్ ప్లాజాలు, పాత నగరంలోని హెరిటేజ్ జోన్లు, హాకర్స్ జోన్లు, చిల్డ్రన్స్ థీమ్ పార్కులు, ఎంటర్‌టైన్మెంట్ జోన్లు అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. మూసీ నదిని, నదీ తీరాన్ని ఒక పర్యావరణ హిత పద్ధతిలో సమగ్ర ప్రణాళికతో అద్భుతంగా తీర్చిదిద్దుతామని పునరుద్ఘాటించారు.
రూ.2.75 లక్షల కోట్లతో తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ - ఏ శాఖకు ఎంతంటే?
సాంస్కృతిక కట్టడాల పరిరక్షణ కూడా ఈ పథకంలో భాగంగా అమలు చేస్తామని భట్టి వెల్లడించారు. దీనికి కావాల్సిన నిధుల్లో ఎక్కువ శాతం నది చుట్టు ఉన్న భూములను వాణిజ్య అవసరాలకు అనుగుణంగా మార్చి సమకూరుస్తామని చెప్పారు. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు చార్మినార్, హైటెక్ సిటీ, సాలార్ జంగ్ మ్యూజియం, ఇతర పర్యాటక స్థలాలతో సమానంగా పోటీ పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నారు. హైదరాబాద్ మెడలో అందమైన హారంగా మూసీ నదిని తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ఇందుకోసం బడ్జెట్‌లో వేయి కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
త్వరలోనే కర్షకులకు రుణమాఫీ - కౌలుదారులకు రైతుబంధు
ఆరు గ్యారంటీలకే బడ్జెట్‌లో పెద్దపీట - మొత్తం ఎన్ని నిధులు కేటాయించారో తెలుసా?