Most Luxurious Houses Prices Increased In India : దేశంలోని ప్రధాన నగరాల్లో రూ.40 కోట్ల కంటే విలువ కలిగిన అత్యంత విలాస (అల్ట్రా - లగ్జరీ) ఇళ్లను ఈ ఏడాది జనవరి - ఆగస్టులో 25 వరకు విక్రయమయ్యాయని స్థిరాస్తి కన్సల్టెంట్ అనరాక్ పేర్కొంది. వీటి మొత్తం విలువ రూ.2,443 కోట్లుగా తెలిపింది. ముంబయి, హైదరాబాద్, గురుగ్రామ్, బెంగళూరుల్లో ఈ విక్రయాలు జరిగాయని తెలిపింది.
వీటిల్లో 20 గృహాలు హైరైజ్ అపార్ట్మెంట్లలోనే ఉన్నాయి. వీటి విలువ రూ.1,694 కోట్లు. మిగతా విల్లాల విలువ రూ.748.5 కోట్లు అని నివేదికలో పేర్కొంది. అల్ట్రా లగ్జరీ గృహాలకు సంబంధించిన రూ.100 కోట్ల పైన విలువైన ఒప్పందాలే 9 ఉన్నాయి. వీటి విలువ రూ.1,534 కోట్లని తెలిపింది. గతేడాది ఇలాంటి పెద్ద ఒప్పందాలు 10 జరిగితే వాటి విలువ రూ.1,720 కోట్లు
అల్ట్రా-లగ్జరీ ఇళ్ల అమ్మకాలు ఈ ఏడాదిలో ఇప్పటివరకు పుణె, చెన్నై, కోల్‌కతాలలో ఒక్కటీ జరగలేదని నివేదికలో పేర్కొంది. గత ఏడాదిలో అల్ట్రా-లగ్జరీ విభాగంలో ముంబయి, హైదరాబాద్, గురుగ్రామ్‌లలో 61 ఒప్పందాలు జరిగాయని వివరించింది. వీటి విలువ రూ.4,456 కోట్లని తెలిపింది.
నగరం | ఇళ్లు | విలువ (రూ.కోట్లలో) |
ముంబయి | 21 | 2,200 |
హైదరాబాద్ | 2 | 80 |
గురుగ్రామ్ | 1 | 95 |
బెంగళూరు | 1 | 67.5 |
ఇళ్ల ధరల్లో 80శాతం పెరుగుదల : మ్యాజిక్‌బ్రిక్స్ అధ్యయనం ప్రకారం 2020- 24 మధ్య భారత్‌లోని 10 నగరాల్లో ప్రజల ఆదాయాల్లో వృద్ధిరేటు 5.4 శాతమే. అదే సమయంలో ఇళ్ల ధరలు 9.3% పెరిగాయి. దీని వల్ల ప్రజల ఇళ్ల కొనుగోలు శక్తి తగ్గిందని అధ్యయనం చెబుతోంది. ఇళ్ల ధరలు హైదరాబాద్‌లో 80 శాతం పెరిగినట్లుగా నివేదిక వెల్లడించింది. ముంబయి, దిల్లీ నగరాల్లో ఇళ్ల ధరలు మధ్యతరగతి ప్రజలు భరించలేని స్థాయిలో ఉండగా, చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతా నగరాల్లో కొంత అందుబాటు ధరల్లో ఇళ్లు లభిస్తున్నాయని నివేదిక తెలిపింది.
ఆదాయంలో 61శాతం ఈఎంఐలకే : నెలవారీ ఆదాయంలో ఇంటి లోన్ కోసం చెల్లిస్తున్న ఈఎంఐ వాటా, మనదేశంలో 2020లో సగటున 46% కాగా, 2024 నాటికి 61 శాతానికి పెరిగిందని నివేదిక వెల్లడించింది. అంటే ఇళ్ల కొనుగోలుదారులపై ఈఎంఐ భారం ఒక్కసారిగా పెరిగింది. నెలవారీ ఆదాయంలో కిస్తీలు(ఈఎంఐ) వాటా ముంబయిలో 116%, దిల్లీలో 82% ఉండగా హైదరాబాద్‌లో 61 శాతంగా ఉంది. అంటే ఈ నగరాల్లో ప్రజలు తమ కుటుంబ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని హోమ్‌లోన్ వాయిదా చెల్లించడానికే కేటాయిస్తున్నారు. అహ్మదాబాద్ - చెన్నై నగరాల్లో ఇది 41% ఉండగా కోల్‌కతాలో 47 శాతంగా ఉంది. అంటే ఇళ్ల ధరలు ఈ మూడు నగరాల్లో కొంత అందుబాటులో ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇల్లు కొంటున్నారా? - ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే సంగతులు - Tips to Avoid Real Estate Scams