Passengers Traveling Dangerously: కూర్చోవాల్సిన ఆటోలో లెక్కకు మించి ప్రయాణికులను కుక్కుతున్నారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో కూలీలు నిత్యం ప్రమాదపు అంచులో ప్రయాణిస్తున్నారు. జిల్లాకు వ్యవసాయ పనుల కోసం బయట ప్రాంతాల నుంచి కూలీలు వస్తూ ఉంటారు. అయితే ఇదే అదనుగా కొంతమంది ప్రైవేట్ వాహనదారులు ఇష్టారీతిన కూలీలను తరలిస్తున్నారు. ఒక్కో ఆటోలో దాదాపు 20 నుంచి 25 మందిని తీసుకెళ్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తోంది. ఎప్పుడు ఏ రూపంలో ప్రమాదం ముంచకొస్తుందో తెలియని పరిస్థితుల్లో లెక్కకు మించి కూలీలను తరలిస్తున్నారు.
ఏకంగా 50 మందిని కుక్కుతున్నారు: సాధారణంగా ఆటోలో డ్రైవర్‌తో సహా అయిదుగురు మాత్రమే ప్రయాణించాలి. కానీ దాదాపు 20 మందికి మించి కూలీలను తరలిస్తున్నారు. బొలెరోలో అయితే ఏకంగా 50 మందిని కుక్కుతున్నారు. జీపుల్లోనూ 30 మందిని తీసుకెళ్తున్నారు. వాహనాలకు వేలాడుతూ, దానిపై కూర్చొని, అటు ఇటు నిలబడి, ఎలా పడితే అలా ప్రయాణం చేస్తున్నారు. పోలీసులకు ఈ విధంగా ఎక్కువ మందితో వాహనాలు కనిపిస్తే కూలీలకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అయినా పరిస్థితిలో మార్పు రావడం లేదు.
తాము ప్రతిరోజు తనిఖీలు చేస్తున్నామని, వాహనాల్లో లెక్కకు మించి కూలీలు కనిపిస్తే తప్పకుండా కౌన్సిలింగ్ ఇస్తున్నామని పోలీసులు తెలుపుతున్నారు. కేసులు సైతం నమోదు చేస్తున్నామని, వాహనదారులను హెచ్చరిస్తున్నామని మక్తల్ సీఐ చంద్రశేఖర్ అన్నారు. అయినా పరిస్థితిలో మార్పు రావడం లేదని, ఏమైనా ప్రమాదం జరిగితే కుటుంబాల పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోవాలని కోరారు.
"ఆటో"పై 4 ఇన్ ఆల్ అంటే- 4X6=24 అని అర్థమట! - Dangerous traveling
గతంలో పరిస్థితి ఇందుకు భిన్నం: అయితే ఈ ప్రాంతంలో గతంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండేది. 2014 సంవత్సరానికి ముందు జిల్లాలో అంతగా పత్తి సాగుచేసేవారు కాదు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఒకరిద్దరు మాత్రమే భూమిని కౌలుకు తీసుకొని సాగు చేసేవారు. నీటి ఇబ్బందితో పాటు ఖర్చుతో కూడిన పంట కావడంతో అక్కడున్న స్థానికులు పత్తి పంటను సాగు చేసేందుకు ధైర్యం చేసేవారు కాదు. 2014 తర్వాత భీమా, జూరాల, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల వంటి పలు సాగునీటి ప్రాజెక్టులు అందుబాటులోకి రావడంతో సాగునీటి కొరత ఉండేది కాదు. దీంతో ప్రతి సంవత్సరం పత్తి సాగు పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం జిల్లాలో సాధారణ విస్తీర్ణం లక్షా 80 వేల 635 ఎకరాల పత్తి సాగు ఉంటే, ఈ ఏడాది సైతం అంతే స్థాయిలో సాగు చేశారు.
గత నెల రోజులుగా పత్తి పంట తొలి కాపు చేతికొచ్చింది. దీంతో పత్తి కూలీలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఒక్కొక్కరికి 300 రూపాయలు కూలీగా ఇస్తున్నారు. స్థానికంగా సరిపడా కూలీలు లేకపోవడంతో బయటి ప్రాంతాల నుంచి రప్పిస్తున్నారు. కర్ణాటక సరిహద్దు గ్రామాలతో పాటు దామరగిద్ద, మద్దూరు, కోస్గి మండలాల నుంచి కూలీలను తరచూ వివిధ వాహనాలలో తరలిస్తున్నారు. అయితే ఈ ప్రయాణంలో వీరి ప్రాణాలు ప్రమాదకరంగా మారుతున్నాయి.