Mobile Thief In Yellandu : దొంగలు పడి డబ్బు, బంగారం చోరీ చేశారని వార్తల్లో తరచూ చూస్తుంటాం. కానీ ఈ దొంగరూటే సెపరేట్. అపహరణకు వెళ్లిన క్రమంలో డబ్బులు చోరీ చేయడు, బంగారాన్ని తాకడు కేవలం అతని టార్గెట్ మొబైల్స్ మాత్రమే. ఖర్చులకు, విలాసాలకు డబ్బులు లేకపోవడంతో కొంత పంథాలో దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఇది ఎక్కడో కాదు ఇల్లందులోనే. అందరూ ఇంట్లో ఉన్న సమయంలోనే చోరీలు చేస్తున్నాడు ఆ గజదొంగ. సింగరేణి కార్మిక కుటుంబాలు నివాసముండే ఇల్లెందు పట్టణంలోని జేకే కాలనీని లక్ష్యంగా ఎంచుకుని స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు.
స్థానికుడి పనేనా? : నిత్యం కార్మిక వాడల్లో తిరుగుతూ ఏ ఇంటికి తాళం వేసి ఉంది? ఏ ఇంట్లో వారు తలుపులు తెరిచి నిద్రపోతున్నారు? ఏ ఇంట్లోని కార్మికులు విధులకు వెళ్లి వస్తున్నారు? అనే అంశాలను ముందుగా పసిగడుతున్నారు. అదును చూసి చోరీలకు పాల్పడుతున్నారు. జల్సాలకు అలవాటు పడిన స్థానిక సింగరేణి కార్మిక కుటుంబానికి చెందిన వ్యక్తే చోరీలకు పాల్పడుతున్నట్లు కార్మిక కుటుంబాలు అనుమానిస్తున్నారు. ఇటీవల జరిగిన ఘటనలో సీసీ కెమెరా వీడియోల్లో చూసిన వ్యక్తి, కార్మిక వాడలో ఉండే వ్యక్తి ఒకే పోలికతో ఉన్నారని గతంలో ఫిర్యాదు చేసిన బాధితులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా అటు సింగరేణి భద్రతా అధికారులు, పోలీసులు స్పందించకపోవటం గమనార్హం.
గుట్టుచప్పుడు కాకుండా : స్థానిక జేకే కాలనీలో ఎమ్మెల్యే, అధికారుల క్వార్టర్లకు సమీపంలో ఓ కార్మికుని భవనంలో నెల రోజుల క్రితం ఓ మహిళ చరవాణి దొంగలించాడు. బాధితులు చరవాణికి ఫోన్ చేస్తే స్పందించిన దొంగ, ‘సెల్‌ఫోన్ కావాలంటే పోలీసులకు చెప్పవద్దని, చెబితే అందులో ఉన్న మీ వీడియోలను వైరల్ చేస్తానంటూ బెదిరించాడు. మరుసటి రోజు బాధితులకు ఫోన్ చేసి సెల్‌ఫోన్ కావాలంటే రూ.3వేలు తీసుకుని అర్ధరాత్రి కళాంజలి సినిమా ధియేటర్ వద్దకు రావాలని తెలిపాడు. తీరా ఆ రోజు వెళ్తే రాలేదు. రెండో రోజు ఫోన్ చేసి బాధితురాలు ఒక్కరే రావాలని సూచించాడు. చివరకు ఓ యువకునికి నైటీ వేయించి మారువేషంలో మహిళలా పంపించారు. దొంగ రెప్పపాటు వేగంతో రూ.3వేలు తీసుకుని చరవాణి ఇచ్చి పలాయనం చిత్తగించాడు. బాధితులు ప్రారంభంలోనే తమ ఇంటి ముందున్న సీసీటీవీ కెమెరా ఫుటేజీ ఆధారంగా ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు.
Only whatsapp call : రెండు నెలల క్రితం ముసుగు ధరించి జేకే కాలనీ అయ్యప్పస్వామి ఆలయం ఏరియాలో ఓ కార్మికుడి ఇంట్లో దొంగతనానికి విఫలయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు గట్టిగా అరవడంతో అక్కడి నుంచి పారిపోయాడు. మూడు రోజుల క్రితం సీఈఆర్ క్లబ్ పక్కన ఉన్న సింగరేణి కార్మికుడి ఇంట్లో సెల్‌ఫోన్ దొంగలించాడు. పౌచ్‌లో ఏటీఎం, ఆధార్ కార్డు ఉండటంతో మరుసటి రోజు ఎవరి కంటపడకుండా ఆ రెండింటినీ కార్మికుడి ఇంట్లో పడేసి ఇంటి గోడపై ‘ఓన్లీ వాట్సప్ కాల్’ అని ఫోన్ నంబర్ రాసి వెళ్లిపోయాడు. ఈ విషయమై కార్మికుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
"చోరీలపై ప్రత్యేక నిఘా పెట్టాం. సెల్‌ఫోన్ దొంగతనాలు మా దృష్టికి వచ్చాయి. విచారణ చేపడుతున్నాం. పెట్రోలింగ్‌తోపాటు, బీట్‌లు పెంచాం. చోరీలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. బాధితులు ఎవరైనా నిర్భయంగా స్టేషన్లో ఫిర్యాదు చేస్తే వారికి న్యాయం చేసేలా చర్యలు చేపడతాం" - బత్తుల సత్యనారాయణ, సీఐ, ఇల్లెందు