Nelakondapally Buddhist Temple : క్రీస్తుశకం రెండో శతాబ్దం నాటి నేలకొండపల్లి బౌద్ధ స్థూపాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు వెంటనే రోడ్‌మ్యాప్ తయారు చేసి డీపీఆర్‌ను సమర్పించాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి పర్యటకులను నేలకొండపల్లి ఆకర్షిస్తోందని, ఇంకా ఎక్కువ మంది ఈ కేంద్రాలను సందర్శించేలా వసతులు మెరుగుపరచాలని అధికారులకు స్పష్టం చేశారు.
ఇవాళ నేలకొండపల్లి మండల కేంద్రంలోని బౌద్ధస్థూపాన్ని మంత్రులు భట్టి, పొంగులేటి, జూపల్లి, తుమ్మల, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి సందర్శించారు. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పర్యాటక స్థలాలను ప్రపంచపటంలో ఉంచాలని, బౌద్ద క్షేత్రాన్ని మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావాలని ప్రణాళికలు వేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం బుద్ధిస్టులను ఇక్కడికి తీసుకువచ్చి, వారి సూచనల ప్రకారం అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
సమన్వయంతో పని చేయాలి : రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి నిధులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, మంత్రి భట్టి పేర్కొన్నారు. నేలకొండపల్లి బౌద్ధ స్ధూపాన్ని ఆర్కియాలాజీకల్ సైట్‌గా చేయాలని, ఇక్కడికి వచ్చే పర్యాటకులకు అన్ని వసతులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. టూరిజం, ఆర్కియాలజీశాఖలు ఇద్దరు సమన్వయంతో కలిసి పని చేయాలని సూచించారు.
టూరిజం అభివృద్ధి : అనంతరం టూరిజం మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో పెద్ద ఎత్తున పర్యాటక కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. బుద్ధిజం బోధనలు అనుసరించడానికి బౌద్ద స్తూపం ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఇతర దేశాలలో ప్రతి వారంలో రెండు రోజులు పర్యటనలకు వెళ్తారని, విరామం ప్రతి వ్యక్తికి అవసరమని మంత్రి తెలిపారు. ప్రతి ఒక్కరూ టూరిజం పేరుతో ఎక్కడో ఒకచోట పర్యటించాలని, దానితో ఆలోచన విధానం మారుతుందని ఆయన అన్నారు.
అన్ని ఏర్పాట్లు : దేశంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా, నేలకొండపల్లిని తీర్చిదిద్ధుతామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ఇక్కడి బౌద్ద స్ధూపం 1వ శతాబ్దం నాటిదని, దక్షిణ భారతదేశంలోనే ఇక్కడ 8 ఎకరాలలో విస్తరించి ఉందన్నారు. భక్తరామదాసు జన్మించిన స్థలంను మ్యూజియంగా, మందిరాన్ని అభివృద్ధి చేయాలని పర్యాటకులను ఆకర్షించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఆయన తెలిపారు.
"రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎన్ని నిధులైనా కేటాయిస్తాము. టూరిజం ద్వారా రాష్ట్రానికి పేరుతో పాటు ఆదాయం కూడా వస్తుంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాము. ఇక్కడకు వచ్చే పర్యాటకులకు అన్ని వసతులను ఏర్పాటు చేస్తాము". - భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం