Minister Tummala Review on Seed Distribution : రాష్ట్రంలో నాసిరకం, నకిలీ విత్తనాలు రైతులకు అంటగట్టాలని ప్రయత్నించే సదరు విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో పత్తి, పచ్చిరొట్ట విత్తనాల లభ్యత, విత్తనాల పంపిణీ పురోగతిపై రాష్ట్రస్థాయి అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా నేటి వరకు వివిధ కంపెనీలు 68,16,967 పత్తి విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉన్న దృష్ట్యా మిగతా ప్యాకెట్లు కూడా జూన్ 5కు కల్లా జిల్లాలకు చేరేవిధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లాలకు సరిపడా రసాయన ఎరువులు, విత్తనాలు అందిస్తున్నామని అవి సక్రమంగా రైతులకు అందించే బాధ్యత జిల్లా కలెక్టర్లదేనని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. అదే విధంగా ఇప్పటికే అన్ని జిల్లాల్లో అవసరం మేరకు పత్తి, జిలుగు విత్తనాలు చేరవేసినందున జిల్లా కలెక్టర్లు అవి రైతులకు సక్రమంగా చేరేలా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలకు వచ్చిన విత్తనాల సరఫరాలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూసుకోవాలని జిల్లా కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులను కోరారు. ఎక్కడైనా రైతులు ఎక్కువ సంఖ్యలో వచ్చినట్లైతే అందుకు తగ్గట్లు కౌంటర్లు ఎక్కువ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
ఇక నుంచి జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులు ప్రతినిత్యం పర్యటిస్తూ పత్తి విత్తనాల విక్రయ కేంద్రాలు, జీలుగ, జనుము సరఫరా చేసే కేంద్రాలను సందర్శిస్తూ రైతులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది రాకుండా చర్యలు చేపట్టాల్సిందిగా మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. అనంతం విత్తన కంపెనీల ప్రతినిధులందరినీ పిలిపించి కంపెనీల వారీగా సమీక్ష జరిపారు. రాష్ట్రంలో గత వారంలో కురిసిన వర్షాలకు రైతులు దుక్కులు చేసుకొని సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇది దృష్టిలో పెట్టుకుని విత్తన కంపెనీలు ఇచ్చిన ప్రణాళిక ప్రకారం మిగతా పత్తి విత్తన ప్యాకెట్లు కూడా జూన్ 5వరక జిల్లాకు చేరవేర్చాలని ఆదేశించారు.
కొన్ని జిల్లాల్లో ఆదిలాబాద్ జిల్లాలో ఒక కంపెనీ, ఒక రకమైన విత్తనాలనే రైతులందరూ కోరుతున్నారని మంత్రి ముందు ప్రస్తావించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనల ప్రకారం మార్కెట్‌లో లభ్యమవుతున్న పత్తి విత్తన హైబ్రిడ్ల దిగుబడి ఒక్కటేనని ఈ విషయాన్ని రైతులందరిలోకి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉందని మంత్రి చెప్పారు. ప్రతిరోజు జిల్లావారీ, కంపెనీవారీగా పత్తి విత్తన ప్యాకెట్ల పంపిణీ, కొనుగోలు వివరాలు తెప్పించుకోవడం జరుగుతుందని అన్నారు. అన్ని జిల్లాల్లో పత్తి, పచ్చిరొట్ట విత్తనాలు అవసరం మేరకు ఉన్నాయని తెలిపారు. రైతులెవరూ తొందరపడకుండా వారివారి అవసరం మేరకు ప్రభుత్వ ఆమోదిత దుకాణాల నుంచి విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. రైతులు ప్రతి కొనుగోలుకు సంబంధించి విధిగా బిల్లులు తీసుకుని పంట అమ్ముకునే దాకా భద్రపరుచుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.