Minister Tummala Fires On Opposition Parties : రైతు రుణమాఫీపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని రాష్ట్ర వ్యవసాయ మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. బ్యాంకులు, అధికారులు ఏమైనా తప్పు చేస్తే, వాటిని సరిదిద్దే ప్రక్రియ మాత్రమే కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటి వరకు 22 లక్షల రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేశామని మంత్రి చెప్పారు. ఆధార్, బ్యాంకు ఖాతాల్లో తప్పులున్న వారికి మాత్రమే రుణమాఫీ ఆగిందని వివరించారు. అదేవిధంగా కుటుంబాలను నిర్ధారించి మిగతా వారికి రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు.
రైతు రుణమాఫీ విషయంలో అధికారం పోయిందని ఆవేదనలో ఉన్న వారి మాటలు నమ్మొద్దని తెలంగాణ రైతాంగాన్ని మంత్రి తుమ్మల కోరారు. కేవలం నెలరోజుల్లోనే మూడు విడతల్లో రూ.18 వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేసిన సర్కారు దేశ చరిత్రలో ఎక్కడా లేదన్నది గుర్తించాలని సూచించారు. రుణమాఫీ గురించి రైతులు ఆందోళన చెందకుండా వ్యవసాయ పనులు చేసుకోవాలని సూచించారు. రుణమాఫీ పొందలేని రైతులు, వ్యవసాయాధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రైతు వేదికలు, మండల ఆఫీసుల్లో అధికారులను పెట్టి వివరాలు తీసుకుంటామని తెలిపారు.
అబద్ధాలు మాట్లాడి రైతుల్లో ఆందోళన పెంచాలని చూస్తున్నారు : రైతుల గురించి ఏమాత్రం పట్టించుకోని, పదేళ్ల పాటు రైతుల్ని మోసం చేసిన పార్టీ మొసలి కన్నీరు కారుస్తోందని తీవ్రంగా ధ్వజమెత్తారు. నల్ల చట్టాలు తెచ్చి రైతులను ఇబ్బంది పెట్టిన జాతీయ పార్టీ కూడా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. అసత్యాలు చెప్పి రైతుల్లో ఆందోళన పెంచాలని చూస్తున్నారని విపక్షాలపై మంత్రి తీవ్రంగా స్పందించారు. మరోవైపు 41,78,892 మంది రైతులు రుణాలు తీసుకున్నారని బ్యాంకులు చెప్పినట్లు తెలిపారు. వారి బకాయిలు రూ.31వేల కోట్లు ఉన్నాయని వివరించారు. చిన్న, సన్నకారు రైతులకు ఎక్కువగా రూ.2 లక్షలలోపు రుణాలే ఉన్నాయన్న మంత్రి, వారికే ముందుగా రుణమాఫీ చేయాలని భావించామని చెప్పుకొచ్చారు. మిగతా వారికి కూడా దశలవారీగా చేస్తామని హామీ ఇచ్చారు.
"రూ.2 లక్షలకు పైన ఉన్న రుణాలపై అతి త్వరలోనే మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఈ పంట కాలంలోనే రూ.2 లక్షలకు పైన రుణాలనూ మాఫీ చేస్తామని హామీ ఇస్తున్నాను. రూ.31 వేల కోట్లు మాఫీ పూర్తయ్యే వరకు 42 లక్షల ఖాతాలకు చేరే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అన్నంపెట్టే అన్నదాతను ఆందోళన పరిచి ప్రేరేపించి రాజకీయ లబ్ధి పొందాలనుకునే నీచ సంస్కృతిని ప్రతిపక్షాలు మానుకోవాలి."-తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర మంత్రి