Minister Thummala On Cotton Purchase : రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లను కొనసాగించాలని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్‌ను కోరారు. ఈ వానాకాలం 2023లో తెలంగాణ రాష్ట్రంలో మొత్తము 44.92 లక్షల ఎకరాలలో పత్తి సాగు చేయగా, 25.02 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రాగలదని అంచనా వేశామని తెలిపారు.
తదనుగుణంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో, 285 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రూ. 8569.13 కోట్లను వెచ్చించి 12.31 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని దాదాపు 5,36,292 రైతుల వద్ద నుండి సేకరించిందని పేర్కొన్నారు. ప్రైవేట్ ట్రేడర్స్ ద్వారా ఇంకొక 4.97 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించారన్నారు.
పత్తి రైతులకు ఆధార్ కష్టాలు - యజమాని వస్తే గానీ జరగని విక్రయాలు
Cotton Corporation of India : ఇంకా కొన్ని జిల్లాలలో పత్తి మూడవ సారి ఏరివేత దశలో ఉండగా, మరికొన్ని ప్రాంతాలలో రైతుల వద్ద మొదటిసారి, రెండవసారి తీసిన పత్తి మొత్తం కలిపి దాదాపు 71 లక్షల క్వింటాల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. గత పక్షం రోజులుగా ప్రపంచ మార్కెట్లో పత్తికి డిమాండ్ పెరిగిన సందర్బాన్ని గుర్తు చేస్తూ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా కొనుగోళ్లను నిరాటంకంగా కొనసాగించాలని కోరారు.
సీసీఐ (CCI) కొనుగోల నుంచి తప్పుకుంటే మార్కెట్లో ధరలు తగ్గే ప్రమాదము ఉందని ఇది రాష్ట్ర ప్రభుత్వానికి, పత్తి రైతులకు మంచి పరిణామం కాదన్నారు. పత్తి నాణ్యతా ప్రమాణాలకు తగట్టుగా రానట్లయితే సీసీఐ ప్రమాణాల ప్రకారం ధరలు నిర్ణయించి కొనుగోలు చేయాలని ప్రభుత్వం తరుపున విజ్ఞప్తి చేశారు.
Minister Tummala on Turmeric Board : కేంద్రప్రభుత్వం ప్రకటించిన జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పసుపు బోర్డు(Turmeric Board) ఏర్పాటు చేయాలనేది పసుపు రైతుల చిరకాల ఆకాంక్షనని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలిపారు. గత పార్లమెంటు ఎన్నికలో పసుపు రైతులు పెద్ద ఎత్తున నిజామాబాద్ ఎంపీ స్థానానికి నామినేషన్లు వేసి నిరసన తెలిపారన్నారు.
అప్పుడు కేంద్రం స్పందించి పసుపు బోర్డు ఏర్పాటుకు స్పష్టమైన వాగ్దానం ఇచ్చిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆ తర్వాత అక్టోబరు 4, 2023న పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిందని గుర్తు చేశారు. అందులో పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, దానికి అవసరమైన బడ్జెట్ ప్రతిపాదన లేకుండా కేవలం కమిటీ సభ్యుల నియామకానికి సంబంధించి వివరాలను మాత్రమే గెజిట్‌లో పేర్కొన్నట్లు మంత్రి తెలిపారు.
పత్తి మాటున 'టేకు' అక్రమ రవాణా - 7 దుంగల విలువ అక్షరాలా రూ.3 లక్షలు
నిరీక్షణకు తెర - ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఎట్టకేలకు పత్తి కొనుగోళ్లు ప్రారంభం