Minister Thummala fires on BRS : రైతుభరోసా విధివిధానాలు ఏమిటి? ఎప్పుడిస్తారు? పంట వేసే ముందు ఇస్తారా? పంట వేశాక ఇస్తారా? అని బీఆర్ఎస్ మాజీ మంత్రి మాట్లాడటం చూస్తుంటే మతిమరుపు ఉందనిపిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నంత కాలం ఏ సమయంలో రైతుబంధు ఇచ్చారో? ఎన్ని పర్యాయాలు పూర్తిగా ఇవ్వకుండా ఆపేశారో లాంటి విషయాలన్నీ తెలంగాణ రైతులకు తెలుసు అని మంత్రి ఆక్షేపించారు. ఈ మేరకు మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణలో 2018లో రైతుబంధును వానా కాలం 128 రోజుల (4 నెలల 5 రోజులు) పాటు, యాసంగి సీజన్‌లో 161 రోజులు, 2019 వానా కాలంలో 138 రోజులు, 2020 వానా కాలంలో 169 రోజులు, 2021-22 యాసంగిలో 84 రోజులు, 2022-23 యాసంగిలో 148 రోజులు, 2023 వానా కాలంలో కూడా 108 రోజుల పాటు రైతుబంధు పథకం పెట్టుబడి సాయం నిధులు విడుదల చేశారని తెలిపారు. ఇప్పటి ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే కోడిగుడ్డుపై ఈకలు ఏరుతున్నట్టు ఉందని ఆయన విమర్శించారు.
అప్పటి రైతుబంధులో లాగా గుట్టలు, రాళ్లు రప్పలు, పుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసిన భూములు, జాతీయ రహదారులు, బంజరు భూములకు ఇచ్చి 12 విడతల్లో 26,500 కోట్ల రూపాయల ప్రజాధనం దుబారా చేశారని మంత్రి మండిపడ్డారు. అందుకే, తమ ప్రభుత్వం హేతుబద్ధంగా రైతు భరోసాను అలాకాకుండా ఒక ఆదర్శవంతమైన పథకంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందన్నారు. ఆ చొరవ యత్నాన్ని హర్షించాల్సింది పోయి విమర్శలకు దిగడం వారి స్థాయిని దిగజార్చుకోవడమేనని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నిటికీ కట్టుబడి ఉన్న దృష్ట్యా, రైతుభరోసా పథకం అమలు విషయంలో ఇప్పటికే రైతుల అభిప్రాయాలు తీసుకొంటున్నామని మంత్రి ప్రస్తావించారు. అదే విధంగా రాష్ట్ర మంత్రివర్గం నియమించిన ఉపసంఘంలో రైతు భరోసా విధివిధానాలు తయారు చేసి త్వరలోనే ఆ పథకం అమలు చేస్తామని తెలిపారు. ఇంకా ప్రభుత్వాన్ని తూలనాడటం మాని, ఎంతో అనుభవం గల మీలాంటి విజ్ఞులు కూడా నిర్ణయాత్మకమైన సలహాలు, సూచనలు ఇచ్చినట్లైతే తాము స్వాగతించి సద్విమర్శలు స్వీకరిస్తామని స్పష్టంచేశారు. నియంతృత్వ పోకడల ప్రభుత్వం తమది కాదంటూ తుమ్మల ఎద్దేవా చేశారు.
కేటీఆర్ తీరు దొంగే 'దొంగా దొంగా' అన్నట్లుగా ఉంది : మంత్రి తుమ్మల - Minister Tummala On KTR Letter