Minister Sridhar Babu on Union Budget 2024 : కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కేంద్రం పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. వర్షకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ఇచ్చిన నిధుల కేటాయింపుపై చర్చించారు. కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరిగిందని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశం పెట్టారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రాల సమాఖ్య స్ఫూర్తి దెబ్బతినేలా కేంద్ర బడ్జెట్ ఉందని ఆయన తెలిపారు. విభజన చట్టం హామీల గురించి ప్రస్తావించలేదని, విభజన చట్టంలో మనకు రావాల్సినవి ఏమీ రాలేదని దుయ్యబట్టారు. మన రాష్ట్రం, దేశంలోనే అతిపెద్ద గ్రోత్ ఇంజిన్ అని, తెలంగాణ ప్రమేయం లేకుండా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఈ దేశంలో తెలంగాణ భాగం కాదా? సమాధానం చెప్పాలని శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు.
విభజన చట్టానికి తూట్లు ఏపీకి కేంద్రం ఏం ఇచ్చినా అభ్యంతరం లేదన్న మంత్రి, ఇరు రాష్ట్రాలకు విభజన చట్టం ఒకటైనప్పుడు తెలంగాణకు కేటాయింపులు ఎందుకు లేవని ప్రశ్నించారు. బీజేపీకి మద్దతిస్తున్నారు కనుక ఏపీకి ఎక్కువ నిధులు కేటాయించారని, ఏపీకి అన్ని రకాలుగా సాయం చేస్తామని బడ్జెట్‌లో హామీ ఇచ్చారని దుయ్యబట్టారు. కానీ రాష్ట్ర విజ్ఞప్తులను కేంద్రం పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని దిల్లీ పెద్దలను కోరామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. పర్యాటకాభివృద్ధికి సహకరించాలని దిల్లీ పెద్దలను కోరామని, బడ్జెట్‌లో భద్రాచలం, రామప్ప, వేములవాడ, యాదగిరిగుట్ట ఊసేలేదన్నారు. కేంద్ర బడ్జెట్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రస్తావనే లేదని, పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగితే మరచిపోయారని మండిపడ్డారు.
ఇతర రాష్ట్రాలకు ఐఐఎంలు ఇచ్చి తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదని మంత్రి శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. వెనుకబడిన జిల్లాలకు పెండింగ్ నిధులు ఇవ్వలేదన్నారు. హైదరాబాద్, ఫార్మా క్యాపిటల్ అని మరిచిపోయారా అని, ఇక్కడి బల్క్ డ్రగ్స్ పరిశ్రమలను ప్రోత్సహించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో మంచి ఎకో సిస్టం ఉందన్న విషయం కేంద్రం గుర్తించాలని, మెడికల్ డివైజస్ పార్కు, మెగా టెక్స్‌టైల్ పార్కుకు నిధులు కోరిన కేటాయింపులు లేవని అన్నారు.