Seethakka Review On Women Safety : మహిళల భద్రత కోసం గ్రామస్థాయిలో సోషల్ యాక్షన్ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. స్వయం సహాయక సంఘాల సభ్యులతో ఏర్పాటు చేసే యాక్షన్ కమిటీలు మహిళలకు రక్షణకవచంలా నిలుస్తాయని మంత్రి పేర్కొన్నారు. మహిళా మంత్రులు, అధికారులతో ఉన్నతస్థాయి కమిటీ వేస్తామన్నారు. మహిళల భద్రతపై సచివాలయంలో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. మహిళల భద్రతపై త్వరలో ఐదు రోజులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్లు తెలిపారు.
మహిళలపై వేధింపులు పెరగడం బాధాకరం : స్వల్ప కాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేస్తామని సమాజంలో ఆలోచన మారేలా కార్యచరణ రూపొందిస్తామన్నారు. మహిళలపై సన్నిహితుల వేధింపులు పెరగడం బాధాకరమని సీతక్క వ్యాఖ్యానించారు. వేధింపులపై మహిళలు బహిరంగంగా మాట్లాడే ధైర్యాన్ని కల్పిస్తామన్నారు. విద్య, ఇతర సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. మహిళలను వేధించకుండా పురుషులకు కూడా అవగాహన కల్పిస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమానికి మహిళ, శిశు సంక్షేమ కార్యదర్శి వాకాటి కరుణ, సెర్ప్ సీఈవో దివ్య, మహిళ భద్రత విభాగం డీజీ షిఖా గోయెల్, డీఐజీ రెమా రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.