Minister Ponnam Prabhakar Review Meeting on GHMC : రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వం కొలువుదీరాక తొలిసారిగా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కమిషనర్ రోనాల్డ్ రాస్, కలెక్టర్ అనుదీప్, మేయర్ విజయలక్ష్మి(Mayor Vijayalakshmi), డిప్యూటీ మేయర్ శ్రీలత సహా వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, జోనల్ స్థాయి అధికారులు హాజరయ్యారు.
హైదరాబాద్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చూసుకోవాలి : మంత్రి పొన్నం
ఈ సందర్భంగా కమిషనర్ రోనాల్డ్ రాస్, జీహెచ్ఎంసీ చేపడుతున్న అభివృద్ధి పనులు, శాఖల వారీగా వివరాలను మంత్రికి వివరించారు. జీహెచ్ఎంసీ ఆదాయంతోపాటు అప్పుల వివరాలను కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే జీహెచ్ఎంసీలో 2,971 ఉద్యోగ ఖాళీలున్నాయని కమిషనర్ వివరించారు. నగరంలో తాగునీటి సరఫరా(Drinking Water Supply), పారిశుద్ధ్య నిర్వహణ, విపత్తు నిర్వహణ సహా వివిధ విభాగాల పనితీరును మంత్రి పొన్నం అధికారులను అడిగి తెలుసుకున్నారు. దాదాపు 5 గంటలపాటు సాగిన సమావేశంలో జీహెచ్ఎంసీ ఉన్నతాధికారుల తీరుపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.
Minister Ponnam Review on GHMC Issues : రాష్ట్రంలో ప్రజాపాలన ఉందని, ప్రజా సమస్యల పరిష్కారంలో జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు తమ ప్రవర్తన మార్చుకోవాలని హితవు పలికారు. తమ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధికి(Hyderabad Development) కట్టుబడి ఉందని, భాగ్యనగరం గుర్తింపు దెబ్బతినకుండా అధికారులంతా కలిసికట్టుగా శ్రమించాలని మంత్రి సూచించారు. జీహెచ్ఎంసీ ఆదాయాన్ని పెంచుకోడానికి ప్రజలపై భారం పడకుండా ఉండే విధానాలను రూపొందించాలని, బల్దియాకు కావల్సిన నిధుల కేటాయింపు ప్రభుత్వం చేస్తుందన్నారు.
జీహెచ్ఎంసీ సమస్యలపై ప్రత్యేక నివేదిక తయారుచేసి ఇవ్వాలని ఆదేశించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లపై త్వరలోనే ప్రభుత్వం తమ విధానాన్ని ప్రకటిస్తుందన్నారు. రాష్ట్ర, నగర ప్రయోజనాల కోసం అవసరమైతే కేంద్ర సహకారం(Central Cooperation) కూడా తీసుకుంటామని, రాష్ట్రానికి రావల్సిన అన్ని పథకాలను తీసుకొస్తామని పొన్నం పేర్కొన్నారు.
"కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధికి సంపూర్ణంగా కట్టుబడి ఉంది. ఎక్కడా కూడా అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం, రాబోయే వేసవికాలంలో నీటి ఎద్దడికి ఎటువంటి అవకాశం లేదు. మనకు నీటి లభ్యతున్న కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల నుంచి వచ్చే నీరు కేవలం తాగటానికి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యతనిస్తాం, తరవాతనే సాగుకు తరలిస్తాం. ఒకవేళ నీటి నిల్వలు తగ్గినా కూడా రాష్ట్రంలో జల పంపిణీకి పంపింగ్ హౌస్లు ఉన్నాయి. ఈ విషయంలో ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు."-పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ మంత్రి
బీసీలందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే కులగణన : మంత్రి పొన్నం ప్రభాకర్
వేసవి రాకముందే నగరంలో తాగునీటి సమస్యను సృష్టించేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని మంత్రి ఆరోపించారు. జీహెచ్ఎంసీలో తాగునీటి ఎద్దడి రాజకీయ అపోహ మాత్రమేనన్న మంత్రి, ఎలాంటి తాగునీటి సమస్య రాకుండా జలమండలి అధికారులు ముందే అప్రమత్తం అవ్వాలని ఆదేశించారు. కృష్ణ, గోదావరి జలాల నుంచి తాగునీటికే ప్రాధాన్యత ఉంటుందని, ఆ తర్వాతే సాగునీటిపై ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. జలమండలిలో ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
Minister Ponnam on Hyderabad Problems : జీహెచ్ఎంసీలో సమస్య పరిష్కారంతోపాటు అధికారుల మధ్య సమన్వయం కోసం ప్రత్యేకంగా ఓఎస్డీని నియమిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. శాఖల వారీగా నివేదికలు అందగానే ఆయా హెచ్వోడీలతో ముఖ్యమంత్రి(CM Revanth Reddy) సమీక్ష నిర్వహించి ప్రభుత్వ విధానాలను ప్రకటించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేది నుంచి ఐదో తేదీ లోపు వేతనాలు ఇస్తున్నామని, జీహెచ్ఎంసీ ఉద్యోగులు కూడా అదే తేదీల్లో వేతనాలు జమ అవుతాయన్నారు.
జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు సమీక్షల పేరుతో సమయాన్ని వృథా చేయవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సమస్యల పరిష్కారంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని, అత్యవసరం అనుకుంటే వెంటనే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని జీహెచ్ఎంసీ అధికారులను పొన్నం ఆదేశించారు.
సర్కార్ దవాఖానాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తాం : కాంగ్రెస్ మంత్రులు