Indiramma Housing Scheme Update : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఈనెల 5 లేదా 6న ప్రారంభమవుతుందని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గ్రామసభల్లో ఇందిరమ్మ కమిటీల ద్వారా ఈనెల 20 వరకు మొదటి విడత అర్హుల ఎంపిక పూర్తవుతుందన్నారు. గ్రామసభలే లబ్ధిదారులను ఎంపిక చేస్తాయని మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకుల జోక్యం ఉండదని పొంగులేటి తెలిపారు. పార్టీలకు అతీతంగా పేదల్లో నిరుపేదలను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. మొదటి విడతలో ఇంటి స్థలం ఉన్న వారిని ఎంపిక చేసి దశల వారీగా 5 లక్షల రూపాయలు మంజూరు చేయనున్నట్లు మంత్రి చెప్పారు.
నాలుగు దశల్లో బిల్లు మంజూరు : మహిళల పేరిటే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. లబ్ధిదారులు ఇళ్లను తమకు నచ్చిన డిజైన్‌లో కట్టుకోవచ్చునని, కచ్చితంగా కనీసం 400 చదరపు అడుగుల్లో వంటగది, బాత్రూం, పడక గదితో నిర్మించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. నాలుగు విడతల్లో లబ్దిదారులకు ఐదు లక్షల రూపాయలు, గ్రీన్ చానెల్ ద్వారా చెల్లిస్తామన్నారు. పునాది పూర్తికాగానే రూ.లక్ష, గోడలు నిర్మాణమయ్యాక రూ.1.25 లక్షలు, స్లాబ్ టైంలో రూ.1.75 లక్షలు, నిర్మాణం పూర్తయిన తరువాత మరో లక్ష రూపాయలు అందజేస్తామని మంత్రి తెలిపారు. బ్యాంక్ అకౌంట్ ద్వారానే లబ్ధిదారులకు నిధులు జమ చేయనున్నట్లు మంత్రి వివరించారు. ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఇస్తుందని, అవసరమైతే లబ్ధిదారులు మరిన్ని డబ్బులతో నిర్మాణాలు చేపట్టుకోవచ్చునన్నారు.
కేంద్ర గృహ నిర్మాణ పథకం మార్గదర్శకాలకు మేరకు ప్రత్యేక యాప్ : మొదటి విడతలో ప్రతీ నియోజకవర్గానికి 3,500 మంజూరు చేస్తామని, నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మించనున్నట్లు వెల్లడించారు. మొదటి విడతలో సుమారు రూ.28వేల కోట్లు ఖర్చవుతుందని.. వివిధ మార్గాల ద్వారా నిధులు సేకరించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కేంద్రం ఇచ్చే నిధులు పోగా, మిగిలిన మొత్తాన్ని రాష్ట్రం భరిస్తుందన్నారు. కేంద్రం నుంచి వీలైనంత వరకు నిధులు తీసుకుంటామని, మిగలినవి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం మార్గదర్శకాలకు అనుగుణంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం ప్రత్యేక యాప్ తయారు చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. లబ్ధిదారుల ఎంపికతో పాటు, ఇళ్ల నిర్మాణ దశలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయనున్నట్లు చెప్పారు.
ఇందిరమ్మ ఇళ్ల పర్యవేక్షణ కోసం విద్య, పోలీస్ హౌజింగ్ వంటి 16 శాఖలకు చెందిన ఇంజినీరింగ్ సిబ్బందిని ఒకే గొడుగు కిందకు తెచ్చి, మండలానికి ఒకరిద్దరిని కేటాయిస్తామన్నారు. స్థలాలు లేని వారికి రెండో దశలో సుమారు 80 గజాలు ఇవ్వడంతో పాటు ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. హైదరాబాద్‌లో డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్లను త్వరలో అప్పగించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లే మరోసారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తాయని కార్యకర్తలు విశ్వసిస్తున్నారన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల ఎంపికపై కీలక అప్డేట్ - వచ్చే వారం అందుబాటులోకి ప్రత్యేక యాప్
కేబినెట్ భేటీ కీలక నిర్ణయాలు : అత్యంత పేదలకు ఇందిరమ్మ ఇళ్లు - ఉద్యోగులకు డీఏ